- ఏర్పాట్లు పూర్తి
- 11 వేల మంది సిబ్బంది నియామకం
- జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణికోటీశ్వరి
చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటల నుంచి పోలియో చుక్కలను పిల్లలకు వేయనున్నారు. ఇందు కోసం 11,616 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఐదేళ్లలోపు వయస్సుగల 4,77,721 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ మే రకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె.కోటీశ్వరి ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2017 నాటికి పోలియో లేని దేశంగా భారత్ అవతరించడానికి ప్రభుత్వాలు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఆది వారం సామూహికంగా పిల్లలకు పోలియో చుక్కల్ని వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2,854 పల్స్ పోలియో బూత్‌లు, వంద సంచార బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు పోలియో చుక్కలు వేయించుకోవడానికి అనువుగా రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో సైతం సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.
ఇక జిల్లాలో 394 హైరిస్క్ ప్రాంతాల్లో 2,850 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 18వ తేదీన పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లల్ని గుర్తించి 19, 20 తేదీల్లో పోలియో చుక్కలు వేస్తామన్నారు. జ్వరం, దగ్గు లాంటి ఇబ్బందులున్న పిల్లలు, ముందు రోజు పోలి యో చుక్కలు వేయించుకున్న పిల్లలు సైతం ఆదివారం తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందును వేయించుకోవాలన్నారు.
తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, బోయకొండ ఆలయాలకు వచ్చే భక్తుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సైతం ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు 6 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు వరసుందరం, వెంకటప్రసాద్, టి.సురేఖ, టి.మునిరత్నం, దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.