అనురాగ బంధం | today raksha bandhan | Sakshi
Sakshi News home page

అనురాగ బంధం

Published Sun, Aug 10 2014 12:12 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

అనురాగ బంధం - Sakshi

అనురాగ బంధం

ఒక కొమ్మకు పూసిన పువ్వుల్లాంటి అన్నాచెల్లెళ్లు ఆత్మీయ సుగంధాలు పంచుకునే వేడుక రాఖీ పండుగ. మమతానురాగాలకు ఈ రక్షాబంధనం చిహ్నం. అమ్మలోని మొదటి అక్షరాన్ని.. నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి అన్న అంటూ ఆప్యాయంగా పిలిపించుకునే సోదరుడి అనురాగ బంధం ఇది. సోదరికి భరోసాగా ఉంటానంటూ ఇచ్చే నమ్మకం... మనోధైర్యాన్ని నింపే రక్తసంబంధం. ఎప్పటిలాగే రాఖీ పండుగ వచ్చింది. మరో మధుర జ్ఞాపకాన్ని మిగిల్చేందుకు, అన్నాచెలెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ అనుబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వేదికగా నిలిచింది. బాధలోనూ, సంతోషంలోనూ, కలిమిలోనూ, లేమిలోనూ.. తోడుగా నిలుస్తానంటూ చేసుకునే బాసలకు గుర్తుగా ఈ రోజు మిగలనుంది. ఎన్నో జన్మల పుణ్యఫలమైన అన్న అనురాగాన్ని, అదృష్టాన్ని సొంతం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తోంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ అనుబంధాల గురించి కొందరు ఇలా వివరించారు..
- నాదెండ్ల/ తెనాలి రూరల్/నరసరావుపేట ఈస్ట్/ప్రత్తిపాడు

  • నేడు రాఖీ పౌర్ణమి   
  • అన్నాచెల్లెళ్ల అనుబంధాల వేడుక ఇది
  • జిల్లావ్యాప్తంగా పండుగ సందడి
  • మార్కెట్‌లో ఆకట్టుకునేలా రాఖీలు

ఒకరికొకరం అండగా..
ఏటా సోదరి సుభాషిణితో రాఖీ కట్టించుకుంటాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. కానీ.. రాఖీ పౌర్ణమికి తప్పనిసరిగా తెనాలి రావాల్సిందే. మూడేళ్ల క్రితం చెల్లికి వివాహం అయి దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఉంటోంది. అయినా ఏటా క్రమం తప్పకుండా రాఖీ కట్టేందుకు వస్తుంది. నేనూ ఆ రోజు వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోను. ఒకరికొకరం అండగా ఉంటామనే భావనను రాఖీ పండుగ కలగ చేస్తుంది. అంతేకాక ప్రేమ, ఆప్యాయతలను మరింతగా పెంచుతుంది.
 - లలిత్‌కుమార్, తెనాలి
 
 
మా అక్క నన్ను అమ్మలా పెంచింది...
మా అక్క డాక్టర్ అన్నపూర్ణ అమ్మలా లాలించి, నాన్నలా చేయూత అందించింది. నా చిన్నతనంలోని మానాన్న కాలంచేస్తే, అప్పటినుంచి మా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల బాధ్యతను మా అక్క తీసుకుంది. మా అభివృద్ధికి పాటుపడింది. మా ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాలను అక్కే పర్యవేక్షిస్తుంది. 49 ఏళ్లుగా వైద్యవృత్తిలో రాణిస్తూనే తమ కుటుంబసభ్యులకు అన్నివిధాలా తోడ్పడింది. ఏటా నాతో పాటు తమ్ముళ్లకు రాఖీ కడుతుంది.  
 - అక్క డాక్టర్ మేదరమెట్ల అన్నపూర్ణతో తమ్ముడు పాలడుగు శ్రీనివాసప్రసాద్,  పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ
 నరసరావుపేట

 
అక్క దగ్గరకు వెళతా..
రాఖీ పండుగ వస్తుందంటే నేను మా అక్కయ్య వెంకట సుబ్బాయమ్మ దగ్గరికి చేరుకుంటా. నా సొంతూరు పత్తిపాడు మండలం గొట్టిపాడు. మా అక్కయ్యతో పాటు మరో అక్క కామేశ్వరమ్మ, చెల్లెలు సామ్రాజ్యమ్మలు నాదెండ్ల మండలం గణపవరంలోనే నివాసం ఉంటారు. రాఖీ పండుగ వచ్చిందంటే నేనే ఇక్కడి ఒక రోజు ముందే చేరుకుంటా. వారితో ఆనందాలు, ఆప్యాయతలు పంచుకుంటా. ఇలా 50 సంవత్సరాలుగా పండుగ జరుపుకొంటున్నాం.
- గుంటుపల్లి సూర్యనారాయణ, గొట్టిపాడు
 
మేమున్నామనే భరోసా..
నలుగురు సంతానంలో నేను ఒక్కడిని. ఇద్దరు అక్కలకు తమ్ముడిని. ఓ చెల్లికి నేను అన్నను. తరచూ మా అక్కలతో చిన్న చిన్న గొడవలు పడినప్పటికీ మా అమ్మ వారినే అరుస్తుండేది. కొంతసేపు వారితో మాట్లాడకుండా వుండేవాడిని. అనంతరం ఎప్పటిలాగే అందరితో కలిసి అల్లరి చేస్తుండేవాడిని. పెద్దయ్యాక ఏటా అక్కచెల్లెళ్లు రాఖీ పండుగరోజు అందుబాటులో ఉంటే నేరుగా వచ్చి రాఖీ కట్టేవారు. లేకుంటే రాఖీలు పంపి శుభాకాంక్షలు తెలుపుతారు. కష్ట నష్టాల్లో మేమున్నామనే భరోసా ఇవ్వడం రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. ఇది అన్నాచెలెళ్లలో మనోధైర్యాన్ని నింపుతుంది.
 - రూరల్‌ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ
 
పండుగలా జరుపుకొంటాం..
నాకు అక్క, చెల్లి ఉన్నారు. చిన్నతనం నుంచి నేను అల్లరి చేస్తుండేవాడిని. మా అక్క తరచూ నాతో దెబ్బలాడుతుండేది. పెద్ద అయ్యాక ఏటా రాఖీ పౌర్ణమిని మా ఇంట్లో పండుగలా జరుపుకుంటాం. అక్క, చెల్లెళ్లతోపాటు మా బంధువుల ఇళ్లల్లోని అక్క చెల్లెళ్ళు, స్నేహితులు రాఖీ కట్టేవారు. ఏటా మా ఇంట్లో ఓ ప్రత్యేకతను చాటినట్లుగా ఉంటుంది. అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయతకు రాఖీ పౌర్ణమి నిదర్శనం. మా గ్రామంలో ఉంటే రాఖీలు కట్టేవారు. ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో ఏటా కొద్ది రోజులముందుగానే రాఖీలను పంపిస్తారు. వారికి గుర్తుగా రాఖీపౌర్ణమి రోజు వాటిని కట్టుకుంటాను. వారు కలిసిన సందర్భాల్లో తప్పకుండా బహుమతులను అందజేస్తుంటాను.
 - రాజేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ
 
 
అన్నాచెల్లెళ్ల అనురాగం..
తోబుట్టువుకు చివరి వరకు తోడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తూ రాఖీ పండుగ జరుపుకొంటారని అమ్మ చెబుతుండేది. ఏటా అమ్మానాన్నలు దగ్గరుండి నాకు చెల్లాయితో రాఖీ కట్టిస్తారు. ఈ ఆప్యాయతలు ఎప్పటికీ మరువలేనివి.
- కె.విశ్వనాథ్

అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. ఏటా క్రమం తప్పకుండా రాఖీ వేడుకలను జరుపుకొంటాము. అన్నయ్యకు రాఖీ కడతాను. ఇప్పుడే కాదు ఎప్పటికీ అన్నయ్య ప్రేమను మరిచిపోను.  
 - తేజశ్విని, ప్రత్తిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement