నేడే పోలింగ్
తిరుపతి ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
బరిలో 13 మంది అభ్యర్థులు
ఓటర్లు 2,94,781 మంది
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
నోటా ఓటుకు 14వ నంబర్
తిరుపతి తుడా: తిరుపతి ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం ఏడు నుంచి సా యంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అభ్యర్థులపై అసంతృప్తి ఉండేవారు ఓటింగ్‌కు దూరంగా ఉండకుండా నోటా ఓటుకు 14వ నంబర్‌ను కేటాయించారు. నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్‌వర్స్‌తోపాటు వీడియో గ్రాఫర్‌లతో పర్యవేక్షించనున్నారు. రెవెన్యూతోపాటు ఇతర విభాగాలను చెందిన 1600 వందల మంది ఉద్యోగులకు పోలింగ్ విధులు కేటాయించారు. 1800 మంది పోలీసులు, ఐదు బెటాలియన్‌ల భద్రత విధుల్లో ఉన్నారు. ఉప పోరులో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు లోక్‌సత్తా , ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు ప్రభావం చూపనున్నారు.
నిర్భయంగా ఓటేయండి
రాజ్యాంగం కల్పించినే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. నిర్భయంగా ఓటు వేసేందుకు భారీ ఏర్పాట్లను చేశాం. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. ఓటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే 0877- 2240201 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఓటరు స్లిప్ తీసుకోని వారు ఓటింగ్‌కు వచ్చేసమయంలో 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్లు లేని వారు పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పొందవచ్చు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
-వి.వీరబ్రహ్మయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తిరుపతి