ఏడు శాసనమండలి స్థానాలకు నేడు పోలింగ్
సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపుఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ఎమ్మెల్యేలు
మొదటిసారిగా అభ్యర్థుల ఫొటోతో పాటు ‘నోటా’కు అవకాశం
బెంగళూరు: శాసనసభ నుంచి ఏడు శాసనమండలి స్థానాలకు శుక్రవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. బెంగళూరులోని విధానసౌధలో 106వ గదిలో పోలింగ్‌కు అవసరమైన పోలింగ్‌బూత్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. శాసనమండలి అభ్యర్థుల ఎన్నిక విషయంలో శాసనసభ్యులు రహస్య ఓటింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. శాసనసభ్యులు తాము ఎవరికి ఓటు వేశామన్న విషయాన్ని ఏజెంట్లకు చూపించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పోలింగ్ బూత్‌లోనికి సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి ఓటును రద్దు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో స్పీకర్‌తో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీంతో మొత్తం 225 మంది శాసనసభ్యులు పోలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొదటిసారిగా బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించనున్నారు. అదే విధంగా నోటా (నన్ ఆఫ్ ది ఎబో)కు అవకాశం కల్పించారు.
ఇదిలా ఉండగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఐదు గంటలకు ప్రారంభమై గంటలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శనివారం జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి కే.ఎస్ మూర్తి తెలిపారు. ఈ ఎన్నికల్లో నామినేటెడ్ శాసనసభ్యుడు తప్ప మిగిలిన 224 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాగా, ఏడు శాసనమండలి స్థానాలకు గాను ఎనిమిది మంది ఎన్నికల బరిలో ఉండగా నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.