అహ్మదాబాద్: కట్టుదిట్టమైన భద్రత నడుమ గుజరాత్‌లో శనివారం ఉదయం తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లోని 89 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, 22 ఏళ్ల అధికార వనవాసానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో సూచించారు.
ఓటేసిన సీఎం
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్‌కోట్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి రూపానీ పోటీచేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రాజ్యగురును కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో అత్యంత ధనికుడైన అభ్యర్థి రాజ్యగురు కావడం గమనార్హం.
150 సీట్లు మావే!
ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ జితూ వాఘానీ ధీమా వ్యక్తం చేశారు. 'ప్రధాని మోదీ నాయకత్వంలో మేం 150 సీట్లు గెలుచుకోబోతున్నాం. ఇందుకు ఎలాంటి ఆటంకం లేదు' అని ఆయన అన్నారు. భావ్‌నగర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకం కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఈ దశ ఎన్నికల్లో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (రాజ్‌కోట్), కాంగ్రెస్ హేమాహేమీలు శక్తిసింగ్ గోహిల్ (మాండ్వి), పరేశ్ ధనానీ (అమ్రేలీ)లు వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో సూరత్ నగరం పరిధిలోని 12 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. సూరత్‌లోని రెండు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment