గులాబీ.. ప్రేమికుల రాయబారి
నేడు వాలెంటైన్స్ డేకు ప్రత్యేకం
మార్కెట్‌ను ముంచెత్తుతున్న గులాబీలు
రూ.50 లక్షల విక్రయాలు జరగొచ్చని వ్యాపార వర్గాల అంచనా
భాషకు మాటే ప్రాణం.. మనసుకు భావం వేదం.. ప్రేమకు ప్రేమే సర్వం.. హృదయంలో దాగిఉన్న ప్రేమ వ్యక్తం కావాలంటే.. మనసును గెలిచే, నచ్చే గులాబీకే సాధ్యం. అందుకే వాలెంటైన్‌స డే పుణ్యమా అని గులాబీల ధర నింగిని తాకుతోంది.
- అమలాపురం
‘గులాబీలు.. నీ గుండెలో భావాలను అవతలి హృదయానికి అందంగా వ్యక్తీకరించే మంత్రముగ్ధమైన సాధనాలు’ అని ఓ కవి హృదయం స్పందించింది. నిజమే.. ప్రేమికుల మధ్య రాయబారం నడపడంలో గులాబీలదే అగ్రస్థానం. ప్రేమ లేఖల స్థానంలో గ్రీటింగ్‌లు వచ్చాయి. వాటి స్థానంలో సెల్‌ఫోన్ల ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు వచ్చాయి. రహస్యంగా కాదు.. తమ ప్రేమ బహిరంగంగా వ్యక్తం చేయాలనుకునే వారు ఫేస్‌బుక్, ట్విట్టర్లనూ ఆశ్రయిస్తున్నారు. కాలంతో పాటు ప్రేమ విషయంలో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నా.. గులాబీల రాయబారం మాత్రం బలపడుతోంది. ప్రేమికుల దినోత్సవం (వాలెంటెన్స్ డే) రోజున ప్రేమ రాయబారానికి గులాబీ తప్పనిసరి.
వందలు, వేల రూపాయల విలువ చేసే ఖరీదైన బహుమతి ఇవ్వడం కంటే.. వాటికి గులాబీలు కూడా కలిస్తేనే ప్రేమికుల రోజు పరిపూర్ణమవుతుంది. ప్రేమికుల రోజుల ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల గులాబీలు ప్రేమికుల చేతులు మారతాయని ఓ అంచనా. మన జిల్లాలో కూడా ఈ ఒక్కరోజు రూ.50 లక్షల మేర గులాబీల వ్యాపారం జరుగుతుందని అంచనా. కడియం నర్సరీల్లో పూచే గులాబీలకన్నా ప్రేమికులు కట్ రోజస్ (కాడ గులాబీ)ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇందుకోసం పూల వ్యాపారులు బెంగళూరు నుంచి ప్రేమికుల దినోత్సవం కోసం పెద్దఎత్తున గులాబీలు దిగుమతి చేయిస్తున్నారు.
ఎరుపు (రెడ్)
ప్రేమకు నిర్వచనం ఇదే. ఈ గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికురాలు, ప్రేమికుడికి ప్రేమను చెప్పడమే కాదు. వారి అందాన్ని అభిమానిస్తున్నట్టు, ప్రేమపై తమ ధైర్యాన్ని వ్యక్తపరిచి, ప్రేమికులకు గౌరవం ఇస్తున్నట్టు భావిస్తారు.
తెలుపు (వైట్)
తమ ప్రేమ చాలా పవిత్రమైందని తెలుపు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తం చేస్తారు. కల్మషం లేని తమ హృదయాన్ని అర్ధం చేసుకోమంటూ ప్రేమపై తమ ఉత్సాహాన్ని చాటుతారు.
పసుపు (ఎల్లో)
ప్రేమికురాలిని కలిశానన్న సంతోషాన్ని, ఆమె లేదా అతడిపై ఉన్న స్నేహభావాన్ని, కలిసేందుకు వచ్చిన వారికి స్వాగతం చెప్పడం అనేది పసుపు గులాబీ ఇవ్వడం ద్వారా చెబుతారు.
గులాబీ (పింక్)
ప్రేమికులు పరస్పరం అభినందనలు చెప్పుకోవడానికి, తమ సంపూర్ణ ఆనందానికి ఈ రంగు గులాబీ ఇస్తుంటారు. అలాగే తమలోని దయ, అనుగ్రహాన్ని కూడా ఈ గులాబీ ఇవ్వడం ద్వారా వ్యక్తపరుస్తారు.
లేత గులాబీ (లైట్ పింక్)
తమలో తియ్యనైన ప్రేమను లేతగులాబీ రంగు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తపరుస్తారు. కష్టాల్లో ఉన్న ప్రేమికురాలు లేదా ప్రేమికుడిపై తమన సానుభూతిని కూడా ఈ గులాబీ ద్వారా వ్యక్తం చేసుకుంటారు.
నీలం (బ్లూ)
ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమ ప్రేమకు ఏదీ అసాధ్యం కాదని ప్రేమికులు నిరూపించుకుంటారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడమైనా, కుటుంబాల కోసం త్యాగాలకు సిద్ధపడినా.. దానికి నీలం రంగు గులాబీ ఇస్తారన్న మాట.
వంగరంగు (లేవండర్)
ఈ గులాబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (తొలి చూపులోనే ప్రేమ)కు గుర్తు. ఇలా ప్రేమించేవారు ఈ రంగు గులాబీని ఇస్తుంటారు.
నారింజ (ఆరెంజ్)
ప్రేమికులు ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమలోని కోరికలను, ప్రేమికుల నుంచి ఆశిస్తున్న ప్రేమను వ్యక్తం చేస్తారు. తమలోని సృజనాత్మకతను, పరస్పరం తమ పరవశాన్ని తెలుపుతారు.