నేడు విజయవాడలో అమిత్‘షో’
- పార్టీ పటిష్టానికే ప్రాధాన్యం
- కార్యకర్తలకు దిశానిర్దేశం చే యనున్న బీజేపీ అధినేత
సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో సంబంధాల కొనసాగింపు విషయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ భవిష్యత్తులో సొంతంగా బలమైన శక్తిగా ఎదగడంపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలకు తాజాగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రధానంగా టీడీపీతో పొత్తు వల్ల పార్టీ పరంగా నష్టపోయిన విషయాన్ని తెలంగాణ శాఖ నివేదించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా సంకేతాల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని గ్రామ స్థాయిల్లో బలోపేతం చేసుకునే క్రమంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు లక్ష్యాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్టు కనబడుతోంది. ఆ తర్వాతే చేరికలపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతలు చె ప్తున్నారు.
అంతా అంతర్గతమే
గురువారం తెలంగాణలో పార్టీ పటిష్టానికి దిశానిర్దేశం చేసిన ఆయన రాత్రికి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విజయవాడలో బీజేపీ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌కు అమిత్‌షా చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర విభజనానంతర పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడమన్న అంశమే ప్రధాన ఎజెండాగా అమిత్ షా పర్యటన కొనసాగుతోందని పార్టీ వర్గాలంటున్నాయి.
విజయవాడ పర్యటనలో అమిత్ షా 11గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడటం మినహాయిస్తే మిగతావన్నీ పార్టీ అంతర్గత సమావేశాలే కావడం గమనార్హం. మధ్యాహ్నం 2.30 గంటలకు ఐవీ ప్యాలెస్‌లో విజయవాడ, కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 2గంటలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల పార్టీ సభ్యత్వ ప్రముఖ్ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు.పార్టీ పునాదుల్ని పటిష్టం చేయడం, లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహ రచనలో దిట్టగా పేరుగాంచిన అమిత్ షా.. ఈసారి తన పర్యటనను కేవలం అందుకోసమే వినియోగించబోతున్నట్టు సమాచారం. పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవడానికి రాష్ట్ర శాఖ నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలందరితోనూ ఆయన భేటీ కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఇప్పటికిప్పుడు పార్టీలో చేరే అవకాశం లేదని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
అమిత్‌షాకు ఘనస్వాగతం
తాడేపల్లి రూరల్ : గురువారం రాత్రి విజయవాడ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన బస చేయనున్న గంగరాజు గెస్ట్‌హౌస్ వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలోచేరుకున్నారు.
సమయం లేదు.. రాలేను బాబు ఆహ్వానాన్ని తిరస్కరించిన షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తన ఇంటికి ఆహ్వానించారు. అయితే సమయం లేని కారణంగా రాలేకపోతున్నానంటూ షా సున్నితంగా తిరస్కరించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపారు. షాకు.. చంద్రబాబు ఫోన్ చేసి తన నివాసానికి రావలసిందిగా ఆహ్వానించారు. అయితే విజయవాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను రాలేకపోతున్నానని చెప్పి, ఆయన ఏపీకి వెళ్లిపోయినట్లు బీజేపీ అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి.