విజయవాడలో భారీ వర్షానికి నీట మునిగిన రోడ్లు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న తరుణంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై ముందుగానే మొదలైంది. దీంతో ఉపరితలంలో కోస్తా వెంబడి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనంలో భాగంగా శుక్రవారం లేదా శనివారం ఏపీ మీదుగా వెళ్లిపోగానే.. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. అక్టోబర్ 15 నుంచి 20లోపు ఇవి ప్రవేశిస్తాయి. కాగా, ఈశాన్య పవనాల కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మరోవైపు.. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి కొమరీన్, రాయలసీమ, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా.. మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు ఐఎండీ గురువారం రాత్రి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పోలవరం, కొయ్యలగూడెంలో 11 సెం.మీ, వరరామచంద్రాపురంలో 8, అవనిగడ్డ, రాయచోటి, కమలాపురంలో 7, పాడేరు, నూజివీడు, మెంటాడ, చింతూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరులో 6 సెంటిమీలర్ల వర్షపాతం నమోదైంది.
విజయవాడలో భారీవర్షం.. అస్తవ్యస్తం
వర్షం బెజవాడను వదలనంటోంది.. రోజులో ఏదోక సమయంలో కురుస్తూ నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతోంది.. కరి మబ్బులతో కూడిన వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తున్నా.. అంతలోనే కురిసే జడివాన జనజీవనాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది. దీనికితోడు పక్కనే పడ్డాయా అన్నట్లుగా దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు.. మెరుపులు నగరవాసిని భీతిగొల్పుతున్నాయి. ఇక వర్షానంతరం మన నగర రోడ్లు సొగసచూడతరమా.. రహదారులా లేక చెరువులా అన్నరీతిలో మోకాళ్ల వరకు నీళ్లతో వాహనచోదకులు, పాదచారుల తిప్పలు చెప్పనలవి కావు. గురువారం విజయవాడలో కురిసిన వర్షం చిత్రాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment