నాడు వైఎస్‌... నేడు జగన్‌ | Today YS Jagan Visit To Tirupati | Sakshi
Sakshi News home page

కాలినడకన తిరుమలకు..

Published Thu, Jan 10 2019 8:12 AM | Last Updated on Thu, Jan 10 2019 8:50 AM

Today YS Jagan Visit to Tirupati - Sakshi

తిరుపతి మార్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన తోరణాలు

సాక్షి, తిరుపతి: తండ్రి బాటలోనే తనయుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు. నేడు వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకోనున్నారు. అదే రోజు తిరుపతి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.. 2017 నవంబర్‌ 6న ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు 3,648 కి.మీ. 2516 గ్రామాల మీదుగా సాగి బుధవారం ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సాగింది. ఈ ఏడాది కూడా జనవరిలోనే  జగన్‌మోహన్‌రెడ్డి యాత్రను పూర్తి చేసుకుని తిరుపతికి వస్తున్నారు.

జననేతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకనున్నాయి. యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి వద్ద 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు జగన్‌కు స్వాగతం పలకడంతో పాటు ఆయన వెంట తిరుమలకు కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌ రైలులో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి వెళ్తారు. అనంతరం తిరుపతి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. అదే రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెలిపారు.

వైఎస్‌ జగన్‌కు భారీ స్వాగత ఏర్పాట్లు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. చంద్రగిరి నియోజక వర్గం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించనున్న మార్గంలో ఏడాదిపాటు వైఎస్‌ జగన్‌ పడిన కష్టాన్ని మరిపించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి 20 అడుగులకు రోడుకిరువైపులా అరటిచెట్టు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దారిపొడవునా మామిడి తోరణాలు, పార్టీ జెండాలతో కూడిన తోరణాలు, 50 వేలకు పైగా పార్టీ జెండా రంగుతో కూడిన బెలూన్స్‌ను మొత్తం కట్టారు. ఇంకా రోడ్డుకిరువైపులా మహిళలు, యువకులు పార్టీ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించి సుమారు 7 టన్నుల వివిధ రకాల పుష్పాలతో ఘనంగా స్వాగతం పలకనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement