సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఈసారైనా తెలుగుదేశం నాయకులు సవ్యంగా జరగనిస్తారా..? ఇది అందరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ స్వయంగా జోక్యం చేసుకుని పరిశీలకులను రంగంలోకి దింపి, సమావేశం మొత్తం వీడియో తీయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరుపుతామని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల ఐదో తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో తెలుగుదేశం సభ్యులు సమావేశ మందిరం బయట, లోపల రగడ సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా జెడ్పీ పీఠం గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డ దారులు తొక్కుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఎంత ప్రలోభాలకు గురిచేసినా వారు లొంగకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు తెలుగుదేశం వైపు వెళ్లడంతో ఇరు పార్టీల బలం 28కి చేరింది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే లాటరీ తప్పకపోవచ్చు.
ఒక బీసీ అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెడితే అతనిని ఓడించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరి కంపార్టుమెంట్‌లో వారే..
ఈ నెల ఐదున ఎన్నిక వాయిదా పడటంతో ఇరు పార్టీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించాయి. తెలుగుదేశం పార్టీ తమ సభ్యులు వారి కుటుంబాలతో కలిసి భవానీ ద్వీపంలో క్యాంపు ఏర్పాటు చేసింది. శనివారం రాత్రి వారిని ఒంగోలుకు తరలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ పార్టీ నుంచి గెలిచిన వారు వారికి కేటాయించిన కంపార్టుమెంట్‌లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం పార్టీ ఫిరాయించిన వారికి ఇబ్బంది కానుంది.
సమావేశ మందిరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్‌తో పాటు ప్రత్యేక పరిశీలకుడు దాన కిషోర్ వేదికపై ఆశీనులౌతారు. ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముందు వరసలో సీట్లు ఏర్పాటు చేశారు. వెనుక తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సభ్యుల కోసం రెండు కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశారు. సభ్యులకు కూడా అక్షర క్రమంలో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి కంపార్టుమెంట్‌కు మధ్య బారికేడింగ్ చేశారు. దీంతో ఒక పార్టీ సభ్యులు మరో పార్టీ సభ్యులతో గొడవపడి ఘర్షణకు దిగే అవకాశం లేదు.
సమావేశానికి వచ్చిన సభ్యులు విడివిడిగా వారి కంపార్టుమెంట్లలోకి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఒకసారి లోపలికి వెళ్లినవారు సమావేశం పూర్తయ్యే వరకూ బయటకు వచ్చే అవకాశం లేదు.
ఉదయం పదిగంటల వరకూ కో-ఆప్షన్ సభ్యులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఒంటిగంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.
మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
జిల్లాపరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు టౌన్: జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ మెంబర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఈనెల 13వ తేదీ స్థానిక పాత జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాపరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకునిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ఏ దానకిషోర్‌ను నియమించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌కు ముందుగా కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక, ఆ తరువాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
ఒంగోలు క్రైం : జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓఎస్డీతోపాటు ముగ్గురు డీఎస్పీలు ఎన్నికల బందోబస్తు వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. గత శనివారం జరిగిన జెడ్పీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ భద్రతా చర్యలు చేపట్టారు.
మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, కందుకూరు డీఎస్పీ శంకర్, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న డీఎస్పీ అశోక్‌బాబును అదనంగా నియమించారు. 35 మంది సీఐలు, 45 మంది ఎస్సైలు, 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు 400 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో ప్రజలు సంచరించకుండా ఆంక్షలు విధించారు. నగరంలో 144 సెక్షన్ పెట్టారు. పాత జెడ్పీ కార్యాలయంలోకి కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు.
పీఠంపై ఉత్కంఠ
Published Sun, Jul 13 2014 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement