
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడు
- ఇంకా ఎటూ తేల్చుకోలే కపోతున్న ‘దేశం’
- అధిష్టానం నుంచి రానున్న సీల్డ్ కవర్ !
- పేరాబత్తుల రాజశేఖర్ వైపే పార్టీ మొగ్గు
- బీసీలకే దక్కనున్న ఉపాధ్యక్ష పదవి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్పష్టమైన మెజారిటీ సాధించినా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరో తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాత్రి వరకు తేల్చుకోలేకపోయింది. కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. జిల్లాలో 57 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా 43 చోట్ల టీడీపీ, 14 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించాయి. పూర్తిస్థాయి మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది.
జెడ్పీ పీఠాన్ని సంప్రదాయం ప్రకారం కాపు సామాజికవర్గానికే కట్టబెట్టాలని తొలుత నిర్ణయించి, అభ్యర్థిని ఆ సామాజికవర్గం నుంచే ఎంపిక చేయాలనుకున్నారు. తొలుత పి.గన్నవరం జెడ్పీటీసీ అభ్యర్థి నామన రాంబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల వ్యయం మూడు కోట్ల వరకు నామన భరించేలా ముఖ్యనేతలు ఒప్పందం కుదిర్చారని పార్టీలో చర్చ నడిచింది. అయితే నామన పేరు తెరపైకి వచ్చేసరికే ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వైపు పార్టీలో మెజారిటీ నేతలు మొగ్గు చూపారు.
రాజశేఖర్ కూడాఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఒకేసారి పార్టీ నాయకత్వం చేతిలో పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎంపిక టీడీపీ నాయకులకు సవాల్‌గా మారింది. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కాకినాడలో రెండు దఫాలు సమావేశమైనా తేల్చలేక చేతులెత్తేశారు.
అంతా చంద్రబాబు వ్యూహమే!
ఈ పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ కూడా చైర్మన్ గిరీని ఆశించారు. చివరిగా బుధవారం కాకినాడలో జరిగిన సమావేశంలోనూ సైతం ఎటూ తేల్చుకోలేని జిల్లా నాయకులు నిర్ణయాన్ని అధినేత చంద్రబాబుకు విడిచి పెట్టారు. జిల్లా నేతల సమావేశాలు, నిర్ణయాన్ని అధిష్టానానికి విడిచి పెట్టడం బాబు వ్యూహంలో భాగమేననే వాదన పార్టీలో వినిపిస్తోంది.
యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెజార్టీ నేతలు రాజశేఖర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఒకరిద్దరు పాతతరం నాయకులు మాత్రం నామన కోసం పట్టుబడుతున్నారని చెబుతున్నారు. యువకుడు, వివాదరహితుడు, చెప్పిన మాట వింటాడనే ముందుచూపుతో అధిష్టానం కూడా రాజశేఖర్ వైపే మొగ్గుచూపిస్తోందని తెలుస్తోంది.
కాగా వైస్ చైర్మన్ పదవి కోసం ఇటీవల జరిగిన జిల్లా ముఖ్యనేతల భేటీ సందర్భంగా రంగంపేట, సామర్లకోట జెడ్పీటీసీ సభ్యులు పెండ్యాల నళీనికాంత్, గుమ్మళ్ల విజయలక్ష్మి వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ పదవిని బీసీలకు కట్టబెట్టాలని పార్టీ భావిస్తుండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీలు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలతో పాటు రాష్ర్ట స్థాయిలో తమకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. శనివారం ఉదయం పార్టీ దూతగా ఎంపీ గరికిపాటి మోహనరావును పంపుతారని ప్రచారం జరిగినా ఆయన స్థానంలో మరో నేత షీల్డ్ కవర్‌తో వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నిక జరిగేదిలా...
తొలుత జెడ్పీలో ఇద్దరు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 12 గంటల వరకు పరిశీలన జరుగుతుంది. మధాహ్నం ఒంటి గంట వరకు ఉపసంహరణకు గడువు. తరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం జెడ్పీటీసీలతో ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రమాణం చేయిస్తారు. మధ్యాహ్నం 3గంటల తరువాత చైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. అయితే ఓటు హక్కు ఉండదు.