బెంబేలెత్తిస్తున్న టమాటో, ఉల్లి ధరలు!
బెంబేలెత్తిస్తున్న టమాటో, ఉల్లి ధరలు!
Published Wed, Jul 16 2014 9:03 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై టమాటో రూపంలో భారీ పిడుగు పడింది. మార్కెట్లో మండుతున్న ధరలతోపాటు టమాటో ధర భారీగా పెరిగింది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత టమాటో ధర పెరగడం గమనార్హం. ప్రస్తుతం రైతు బజార్లో కిలో టమాటో ధర 50 రూపాయలు పలుకుతోంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలోకు 65లకు పైనే ఉంది. రాష్ట్రం నుంచి తమిళనాడుకు టమాటోను భారీగా ఎగుమతి చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లో కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది.
కొరత కారణంగా వ్యాపారులు టమాటో ధరను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. గత మూడు రోజుల్లో కిలో ఒక్కంటికి 20 రూపాయలు పెరిగినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా పెరిగిన టమాటో ధర గురించి పౌరసరఫరాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. టమాటో ధరతోపాటు ఉల్లి ధర కూడా వినియోగదారుల్ని బెంబేలెత్తిస్తోంది.
గత నెల రోజుల్లో ఉల్లి ధర 15 రూపాయలు పెరిగింది. మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లి రైతు బజార్లో 25, బహిరంగ మార్కెట్‌లో రూ.35 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లలో లభించని గ్రేడ్-1 ఉల్లి వినియోగదారులకు లభించడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
Advertisement