పత్తికొండ మార్కెట్ యార్డుకు తక్కువగా వచ్చిన టమాట
కర్నూలు, పత్తికొండ: మార్కెట్‌లో టమాటకు గిట్టుబాటు ధర కరువైంది. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఐదువేల హెక్టార్లలో పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడులు రాలేదు. వైరస్ తెగులు సోకి పంట దెబ్బతినింది. పత్తికొండ మార్కెట్‌కు నవంబరు, డిసెంబర్ నెలల్లో ప్రతి రోజూ 10 నుంచి 12 లోడ్ల సరుకు వచ్చేది. 15 కేజీలు ఉన్న జత గంపలు రూ.1,200 నుంచి రూ.2,500 వరకు పలికేవి. ప్రస్తుతం దిగుబడులు పూర్తిగా తగ్గాయి. రోజుకు 2 నుంచి 3 లోడ్ల సరుకు వస్తోంది. వారం రోజుల నుంచి 30 కేజీలు ఉన్న జత గంప రూ. 150 నుంచి రూ. 200 మాత్రమే పలుకుతోంది. నాణ్యత లేదని చెబుతూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మొదటి రకం 30 కేజీల ధర రూ. 250, రెండో రకం ధర రూ.200, మూడో రకం ధర రూ. 140 పలుకుతోంది. సేద్యాలు, కలుపులు, మందులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఖర్చు చేశామని..పంట అమ్ముకుంటే పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దికెర మండలంలో 750 ఎకరాలు, వెల్దుర్తిలో 125, కృష్ణగిరిలో 250, తుగ్గలిలో 400, పత్తికొండ మండలంలో 325 ఎకరాల్లో టమాట పంటను సాగు చేశారు. సకాలంలో వర్షాలు లేనందుకు 60 శాతం పైరు దెబ్బతినింది. అంతంత మాత్రమే వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధర లేదు.
ప్రతి ఏటా నష్టపోతున్నాం
నేను రెండు ఎకరాల్లో పంట సాగు చేశాను. మెరుగైన దిగుబడులను తీయడానికి రూ.20 వేలు పెట్టు బడులు పెట్టాను. దిగుబడులు చేతికి అందే సమయంలో గిట్టు బాటు ధరలు లేవు. ధర ఉన్న సమయంలో దిగుబడులు రాలేదు. పంటకు పెట్టిన పెట్టు బడులు కూడా చేతికి అందడం లేదు. వ్యవసాయం చేయాలంటేనే భయ మేస్తోంది. ప్రతి ఏటా నష్టపోతున్నాం. –పెద్దరామాంజనేయులు , మద్దికెర
అప్పులు మిగులుతున్నాయి
టమాట వేసినప్పుడల్లా ఏదో విధంగా నష్టం పోతున్నాం. గత ఏడాది రెండు ఎకరాల్లో వేశాను. నష్టం రావడంతో ఈ ఏడాది ఒక ఎకరంతో సరిపెట్టుకున్నా. ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. – మహమ్మద్ , బసినేపల్లి
Comments
Please login to add a commentAdd a comment