కొనుగోలు కేంద్రంలో శనగలను జల్లెడ పడుతున్న రైతులు, విక్రయానికి వచ్చిన శనగ బస్తాలు
గుంటూరు, నరసరావుపేట రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లోని శనగల కొనుగోలు కేంద్రానికి బుధవారం రైతులు పెద్ద ఎత్తున శనగల నిల్వలను తీసుకొచ్చారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌యార్డ్‌లో ప్రారంభించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా ఈ కొనుగోళ్ల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. నరసరావుపేట మండలంతో పాటు ముప్పాళ్ల, సత్తెనపల్లి మండలాలను ఈ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది శనగ పంటను నరసరావుపేట మండలంతో పాటు ముప్పాళ్ల మండలంలో పెద్ద ఎత్తున సాగుచేశారు.
మొదటి విడతగా 100 టన్నుల కొనుగోళ్లకు ఈ కేంద్రానికి అనుమతించారు. వారం రోజుల్లోనే 100 టన్నులను రైతులను నుంచి కొనుగోలు చేశారు. రైతుల వద్ద పెద్ద ఎత్తున శనగ నిల్వలు ఉండటంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధిత మంత్రి కురసాల కన్నబాబుతో పాటు జిల్లా అధికారులతో మాట్లాడి మారో 100 టన్నుల కొనుగోలు చేసేవిధంగా అనుమతులు తీసుకొచ్చారు. మార్కెట్‌లో క్వింటా శనగలు రూ.3 వేల నుంచి రూ.3,500ల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.4,875గా ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.1500 వరకు ఎక్కువ ధర వస్తోంది. దీంతో శనగలను కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు ధృవీకరణ పత్రాలను కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి అందజేస్తే టోకెన్ ఇస్తున్నారు. దీని అధారంగా రైతులు తమ నిల్వలను నిర్ణయించిన తేదీలలో కొనుగోలు కేంద్రంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజూ దాదాపు 200 క్వింటాళ్ల శనగలను కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు.
కేటాయింపులు పెంచాలి
నరసరావుపేట, సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలకు ఒకటే కొనుగోలు కేంద్రం కావడంతో రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఈ కేంద్రం నుంచి 100 టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో 100 టన్నులు కొనేందుకు రైతులకు టోకెన్‌లు అందజేశాం. మరో రెండు రోజుల్లో టోకెన్‌లు పొందిన రైతుల నుంచి కొనుగోళ్లు పూర్తవుతాయి. రైతుల వద్ద ఇంకా శనగ నిల్వలు ఉన్నాయి. కేంద్రానికి కొనుగోళ్లు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. – ఎస్‌ఏ హనీఫ్, మార్కెట్ యార్డ్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment