కర్నూలు జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ మార్కులు | Top Marks for Kurnool District Candidates In AP Grama Sachivalayam Exams | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ మార్కులు

Published Fri, Sep 20 2019 7:58 AM | Last Updated on Fri, Sep 20 2019 8:00 AM

Top Marks for Kurnool District Candidates In AP Grama Sachivalayam Exams - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలో ఉద్యోగాల విప్లవం..ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కొలువులు..అత్యంత పకడ్బందీగా పరీక్షలు..అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడి.. యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్‌ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది.  

గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 19 రకాల పోస్టులను భర్తీ చేసేందుకు 14 రకాల పరీక్షలను ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు  ఆరు రోజుల పాటు పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 881 సచివాలయాల్లో 9,597 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో 11 నుంచి 12 మంది ఉద్యోగులను నియమించనున్నారు. పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫలితాలను రాష్ట్ర స్థాయిలో ప్రకటించినా.. ఎంపిక మాత్రం జిల్లా సెలక్షన్‌ కమిటీలదే. నియమకాల పత్రాలు వారే అందజేయనున్నారు. ఇందు కోసం ఇటీవలే జిల్లా సెలక్షన్‌ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితాలకు సంబంధించి మెరిట్‌ జాబితా శుక్రవారం జిల్లా కమిటీకి చేరనుంది. శనివారం నుంచి మెరిట్‌ లిస్టులో ఉండే వారు.. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి..  
జిల్లాలో మొత్తం 9,597 పోస్టులకుగాను 2,01,886 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 1,80,728 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు జరిగిన పరీక్షలకు 1,33,167 మంది, రెండో రోజు 15,152, మూడో రోజు 4,071, నాల్గో రోజు 1,201, ఐదో రోజు 9,201, ఆరో రోజు 17,936 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒకే నోటిఫికేషన్‌లో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే ఏ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేయలేదు.

2008లో అప్పటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..ప్రస్తుతం రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించనున్నారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  పరీక్షలు రాసిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు 40 శాతం(60 మార్కులు), బీసీలకు 35శాతం(52.5 మార్కులు), ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 30 శాతం(45 మార్కులు)గా నిర్ణయించారు. (చదవండి : ఫలితాల్లోనూ రికార్డ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement