టీడీపీలో పీటముడి | Tough Situation In Tdp Party | Sakshi

టీడీపీలో పీటముడి

Mar 13 2019 10:31 AM | Updated on Mar 23 2019 8:59 PM

Tough Situation In Tdp Party - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి నామినేషన్ల గడువు సమీపిస్తున్నా అధికార టీడీపీలో సీట్ల కేటాయింపు కొలిక్కి రావడం లేదు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నా అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడం లేదు. ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి వ్యవహారం మరింత చిక్కుముడిగా మారింది. దీనితో లింకుగా మారిన కనిగిరి, దర్శి అభ్యర్థుల ఎంపికకు పీటముడి పడింది. ఒంగోలు పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. దీంతో మంత్రి శిద్దా రాఘవరావును  పోటీలో నిలపాలని సీఎం భావిస్తున్నారు.  తాను దర్శి అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని, పార్లమెంట్‌కు మరొకరిని నిలపాలని శిద్దా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలో అర్థంకాక  సీఎం తలపట్టుకుంటున్నట్లు సమాచారం.

కాదూ కూడదని శిద్దా నే పార్లమెంట్‌ కు పోటీచేయించాలనుకున్నా .. దర్శి అసెంబ్లీతో పాటు కనిగిరి అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక మరింత తలనొప్పిగా మారింది.  కనిగిరి సీటులో  సిట్టింగ్‌ ఎమ్మెల్యే  కదిరి బాబూరావు ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డిని నిలపాలని  ముఖ్యమంత్రి  తొలుత నిర్ణయించారు. బాబూరావును  దర్శికి పంపి శిద్దాను  ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేయించాలనుకున్నారు.  అయితే దర్శికి వెళ్లేందుకు బాబూరావు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అయినా ఒత్తిడి తెచ్చి బాబూరావునే దర్శికి పంపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఒక వేళ అందుకు బాబూరావు నిరాకరిస్తే ఏంచేయాలన్న దానిపై ముఖ్యమంత్రి  ప్రత్యామ్నాయం  పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  మంత్రి శిద్దా రాఘవరావు  ఓకే అంటే  ఆయనను ఒంగోలు పార్లమెంట్‌కు పంపి ఉగ్రనరసింహారెడ్డిని  దర్శి అసెంబ్లీకి పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా శిద్దా దర్శి అసెంబ్లీ వైపే మొగ్గే పక్షంలో  ఉగ్ర ను ఒంగోలు పార్లమెంట్‌ బరిలో నిలపాలని  సీఎం యోచిస్తున్నట్లు  తెలుస్తోంది.

మొత్తంగా మంగళవారం సీట్ల పంచాయితీ కొలిక్కి తేవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి అమరావతికి రావాలని సీఎం మంత్రి శిద్దాతో పాటు ఉగ్రనరసింహారెడ్డి, కదిరి బాబూరావులకు కబురు పంపారు. అందరూ అమరావతికి వెళ్లారు. అయితే సీఎం బీజీగా ఉండడంతో ఉదయం జరగాల్సి సమావేశం సాయంత్రానికి కూడా జరగలేదు. బుధవారం మాట్లాడదామని ముఖ్యమంత్రి  చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు ఎంపీపీ వీరయ్యచౌదరి, మాదాల అనిత భర్త మాదాల రమేష్‌లు మంగళవారం అమరావతిలో సీఎంను కలిశారు. అందరూ సర్దుబాటు అయి బీఎన్‌కే మద్దతు పలకాలని ఈ సందర్భంగా  సీఎం అసమ్మతి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన అసమ్మతి నేతలతో  మాట్లాడి రెండు రోజుల్లో అందరినీ సర్దుబాబు చేయాలని సీఎం  ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు మంగళవారం ముఖ్యమంత్రిని  కలిసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తీరుపై  ఆయన సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement