- సిటీప్లానర్‌పై సీఎంకు ఫిర్యాదు చేసిన మేయర్
- ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో కదలిక
- చక్రపాణికి షోకాజ్ నోటీసులు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. విజిలెన్స్ విచారణలు, మేయర్ కోనేరు శ్రీధర్ ఫిర్యాదుల నేపథ్యంలో సిటీప్లానర్ ఎస్.చక్రపాణికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. తాజా పరిణామాలు టౌన్‌ప్లానింగ్ విభాగంలో హాట్‌టాపిక్‌గా మారాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి పెరిగిపోతోందని, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి ఆగడాలు శృతిమించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేయర్ కోనేరు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని 20 రోజుల క్రితం ప్రభుత్వం అప్పటి కమిషనర్ హరికిరణ్‌ను ఆదేశించింది. హరికిరణ్ బదిలీ కావడంతో నాలుగు రోజుల క్రితం ఆ ఫైల్ ను అదనపు కమిషనర్ జి.నాగరాజుకు అప్పగించారు. ఈక్రమంలో ఆయన షోకాజ్ నోటీసు జారీచేశారు.
ఎక్కడైనా ఆయన అంతే..!
సిటీప్లానర్ ఎస్.చక్రపాణి ఎక్కడ పనిచేసినా ఆయనపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. రెండేళ్ల క్రితం గుంటూరు నగరపాలక సంస్థ సిటీప్లానర్‌గా పనిచేసిన సమయంలో కూడా పలు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. అక్కడ ఒక కార్పొరేట్ స్కూల్ భవనానికి రెసిడెన్షియల్ ప్లాన్ మంజూరు చేయగా.. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు గుంటూరు, విజయవాడ నగరాల్లో అనేకం ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోటరీ మాయ...
టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రస్తుతం బ్రోకర్ల రాజ్యం నడుస్తోంది. సిటీప్లానర్‌ను తమగుప్పెట్లో పెట్టుకున్న కొందరు బ్రోకర్లు అడ్డగోలుగా సెకండ్ ఫ్లోర్లు వేయించడంతోపాటు మార్ట్‌గేజ్‌ల మాయ చేస్తున్నారు. బ్రోకర్ల వ్యవహారంపై రెండు నెలల క్రితం మేయర్ మండిపడ్డారు. అయినప్పటికీ ఫలితం లేదు. తనకు అనుకూలంగా ఉండే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లతోనే సిటీప్లానర్ కథ నడుపుతున్నారు. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సిటీప్లానర్ల సంతకాలు లేకుండా నేరుగా ఆయనే కొన్ని ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం.
విజిలెన్స్ విచారణ...
అక్రమ కట్టడాలపై విజిలెన్స్‌కు నేరుగా ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. వన్‌టౌన్ ప్రాంతంలో ఎనిమిది. ఎర్రకట్ట వద్ద ఐదు భవనాలు అక్రమంగా నిర్మించారని నిర్ధారించారు. ఇందుకు బాధ్యుడైన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు సిటీ ప్లానర్‌ను విజిలెన్స్ అధికారులు వారం రోజుల క్రితం విచారణకు పిలిచినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు వారి ద్దరూ విచారణకు హాజరుకాలేదని సమాచారం. రెండేళ్ల నుంచి సిటీప్లానర్‌గా పనిచేస్తున్న చక్రపాణిపై అనేక విమర్శలు ఉన్నా, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ చర్య లు తీసుకోకపోవడంతో మేయర్ సీఎంకు ఫిర్యాదు చేశా రు. ఈక్రమంలోనే విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయింది.
షోకాజ్ నోటీసులు పంపాం : అదనపు కమిషనర్
సిటీప్లానర్‌కు షోకాజ్ నోటీసులు పంపినట్లున్నామని అదనపు కమిషనర్ జి.నాగరాజు ‘సాక్షి’కి చెప్పారు. అయితే ఏ విషయానికి సంబంధించి అనేది స్పష్టంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.