గిద్దలూరులో విషజ్వరాలు
♦ ఒక బాలుడికి డెంగీ
♦ మరో 10 మంది చిన్నారులకు జ్వరాలు
♦ ఆందోళనలో పట్టణ ప్రజలు
గిద్దలూరు : పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. దీంతో ప్రజలు విషజ్వరాల బారినపడి మంచం పడుతున్నారు. ఒక బాలుడు డెంగీ సోకి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అనేక మంది చిన్నారులు, వృద్ధులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. వివరాలు..నాలుగు రోజుల క్రితం నల్లబండ బజారులోని పాములపల్లె రోడ్డులో 15 మందికి జ్వరాలు సోకిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైద్యాధికారులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు.
ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ఉన్న పోస్టాఫీసు వెనుక వీధిలో 10మంది చిన్నారులు విషజ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. పోస్టాఫీసు వెనుక వీధిలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో గేదెలు కట్టేయడం, అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకోవడంతో చిన్నారులకు విషజ్వరాలు వచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. మొన్నటి వరకు పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వలన చెత్త, చెదారం కాలువల్లో పేరుకుపోయి దోమల బెడద ఎక్కువైంది.
బాలుడికి డెంగీ
పోస్టాఫీసు వెనుక వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు చిట్టేల రామాంజనేయులు కుమార్తె, ఆశ్రీత, కుమారుడు అరవింద్‌లు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యశాలలో చికిత్సలందించినా అరవింద్‌కు జ్వరం తగ్గకపోవడంతో రక్తపరీక్షలు చేయగా డెంగీ సోకినట్లు నిర్థారించారు. వెంటనే కర్నూలులోని ఓ వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. డెంగీ సోకినట్లు నిర్థారించిన వైద్యులు 26వ తేదీన పరీక్షించగా ప్లేట్‌లెట్స్ 45 వేలు, 27న 25 వేలు, మంగళవారం 18 వేలకు పడిపోయాయని చెప్పినట్లు బాలుడి తండ్రి రామాంజనేయులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వర్షిత, లిఖిత, హేమంత్‌రెడ్డి మరికొందరు చిన్నారులకు రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు.
పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం...
సమాచారం అందుకున్న క్రిష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీలక్షీ ఆ వీధిలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి కొందరికి టైఫాయిడ్ వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ గేదెలు, పందులు ఎక్కువగా ఉన్నాయని, పక్కనే ఉన్న పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే మల, మూత్ర విసర్జనలు చేస్తున్నారని చెప్పారు. దీంతో జ్వరాలు వస్తున్నట్లు డాక్టర్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు.