- స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ముందుకు సాగని దర్యాప్తు
- ఆ ఇద్దరు మహిళల కోసం పోలీసుల ఆరా
- ఎవరా గుర్తు తెలియని యువకుడు?
విజయవాడ : పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై నమోదైన కేసులో నిందితుల జాడ తెలియడంలేదు. ఈ కేసులో కీలకమైన మహిళలిద్దరి చిరునామాలు తెలియక పోవడంతో దర్యాప్తునకు బ్రేక్ పడింది. ఆ మహిళలను గుర్తించేందుకు ఎలాంటి ఆధారం లభించకపోవటంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలిసింది.
బోగస్ రిజిస్ట్రేషన్ చేయించటంలో సిద్ధహస్తులైన నిందితులు పక్కా వ్యూహంతో రూ.20 కోట్ల విలువైన ఆస్తిని జీపీఏ చేయించి పరారయ్యారు. ఈ కేసులో సూత్రధారుల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ప్రధానంగా ఈ కేసులో ఆస్తి కొనుగోలు చేసిన ఇద్దరు మహిళల ఆచూకీ తెలిస్తేగానీ నిందితులు ఎవరనే విషయం బయటపడే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఆ మహిళల ఆచూకీ కోసం పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత జూన్ 30 తేదీన రిజిస్ట్రేషన్ జరిగిన రోజున సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి స్టూడెంట్ మాదిరిగా ఉన్న ఓ యువకుడు ఆ మహిళలను తీసుకుని వచ్చి 4,033 గజాల స్థలాన్ని జీపీఏ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కానూరుకు చె ందిన డాక్యుమెంట్ రైటర్ వద్దకు ఆ యువకుడు వెళ్లి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించాలని కోరాడు. ఆ యువకుడు తెచ్చిన పత్రాలు, అడ్రస్ ప్రూఫ్‌లతో సదరు డాక్యుమెంట్ రైటర్ దస్తావేజు కాపీని తయారు చేశారు. డాక్యుమెంట్ రైటర్ వద్ద ఉండే ఇద్దరు సహాయకులను సాక్షి సంతకం పెట్టమని కోరాడు.
అలవాటుగా ఇద్దరు యువకులు సాక్షి సంతకాలు పెట్టి ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా నకిలీ అడ్రస్ ప్రూఫ్‌లను పొందుపరిచి బినామీ మహిళలను చూపించి జీపీఏ చేయించి పరారయ్యాడు. నిందితులు ఏవిధంగా పట్టుబడకుండా ప్రణాళికాబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కనీసం పాన్ నంబర్ కూడా ఇవ్వకుండా కేవలం నకిలీ ఆధార్, రేషన్ కార్డులను పొందుపరిచారు.
ఆ యవకుడు కనీసం ఒక్కసారి కూడా డాక్యుమెంట్ రైటర్‌తో గానీ, సాక్షులు, రిజిస్ట్రేషన్స్ సిబ్బందితో గానీ ఫోన్‌లో మాట్లాడలేదు. కేవలం ముఖాముఖిగా పని ముగించుకుని ఆదృశ్యమైనట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నిందితులను పట్టుకోవటానికి పోలీసులకు కనీసం ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దాంతో అన్ని బ్యాంకుల్లో ఈ ఆస్తికి సంబంధించి రుణం కోసం లావాదే వీలు జరిగినట్లు ఆధారాల కోసం పోలీసులు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాచవరం పోలీసు స్టేషన్‌లో 420, 120బి, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.