వాణిజ్యం కేరాఫ్ బెజవాడ
-
ఇప్పటికే 200 కంపెనీల వలస బాట
-
భారీగా పెరుగనున్న వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం
-
రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌తో కంపెనీలకు తగ్గనున్న పన్నుల భారం
విజయవాడ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో వాణిజ్య రాజధాని బెజవాడపై ప్రముఖ కంపెనీలు దృష్టిసారించాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ కంపెనీలు నగరానికి వలస వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పాత రాజధానిలో కార్యకలాపాలు సాగించినా, కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపార లావాదేవీలను విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. కొత్త రాజధాని దగ్గర్లో ఉంటుందనే అంచనాతో పాటు ఇక్కడ ఎయిర్‌పోర్టు, రైల్వే జంక్షన్ ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో నగర పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఒకేసారి రూ.900 కోట్లు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్..
ఆసియాలోనే అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ విజయవాడలో ఉంది. భారీ వాహనాలు ఉత్పత్తి చేసే కంపెనీల బ్రాంచ్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నా, ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండేవి. ఆయా కంపెనీల యజమానులు వాహనాల పన్నుల్ని హైదరాబాద్‌లోనే చెల్లించేవారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విక్రయించిన వాహనాలకు ఇక్కడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్లుగా టాటా, అశోక్ లేల్యాండ్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇతర రంగాలకు చెందిన కంపెనీల ప్రధాన కార్యాలయాలను సైతం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు.
రూ.2 వేల కోట్లకు చేరనున్న ఆదాయం
విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖకు ఏటా వచ్చే ఆదాయం రూ. 1,175 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లకు పెరగనుంది. ఇక్కడ వ్యాపార లావాదేవీలు నడిపేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న దాదాపు 200 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు సుమారు 70కిపైగా విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. శామ్‌సంగ్, సోనీ, మహేంద్ర, టాటాస్టీల్‌తో పాటు, పలు కార్ల సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కొత్తగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.
శివారు ప్రాంతాల్లో భారీ కంపెనీలు
విజయవాడ నగర శివారు ప్రాంతాలు భారీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు శివారుల్లో ఎకరాల కొద్దీ స్థలాలు కొనుగోలు చేసి తమ కార్యాలయాలు నడుపుతుండగా, ఇప్పుడు మిగిలిన కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఏలూరు వెళ్లే రోడ్డులో రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, గన్నవరం వరకు కార్లు, ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. భవానీపురం ఏరియాలో పలు మందుల కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త కంపెనీల రాకతో విజయవాడ ఒకటో డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి ప్రతి నెలా రూ. 25 కోట్లు, డివిజన్-2 కార్యాలయానికి రూ. 50 కోట్లు ఆదాయం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రెండు డివిజన్లలో కలిపి రూ. 900 కోట్లు ఆదాయం పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
పన్నుల భారం ఉండదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి పన్నుల భారం ఉండదని వాణిజ్య పన్నులశాఖ డివిజన్-2 కమిషనర్ శేఖర్ ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో శాఖలు ఉన్నవారికి ఫాం-ఎఫ్ సమర్పిస్తే పన్ను నుంచి మినహాయింపు పొందవ చ్చని పేర్కొన్నారు.