గుణదల (విజయవాడ తూర్పు): మాంసాహార ప్రియులు సరికొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. మటన్, చికెన్, చేపలు, రొయ్యలను ఇష్టంగా భుజి స్తారు. నాటు కోడి, బ్రాయిలర్, పెద్ద బ్రాయిలర్ (పేరెంట్స్) కోళ్ల మాంసం మార్కెట్‌లో లభిస్తోంది. ఇప్పుడు కడక్‌నాథ్ కోడి మాంసం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ధర ఎక్కువైనా మంచి పోషక విలువలతోపాటు రుచికరమైన ఈ మాంసాన్ని భుజించేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు.
కడక్‌నాథ్ కథ ఏమిటంటే..
కడక్‌నాథ్ రకానికి చెందిన కోళ్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. సాధారణంగా నాటుకోళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లు వాటికి భిన్నంగా ఈకలే కాదు శరీరం కూడా నలుపు రంగులో ఉంటాయి. మెలనిన్ అనే హార్మోన్ కారణంగా ఈ కోళ్లు నలుపు రంగులో ఉంటాయి. సాధారణ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. రుచి మాత్రం బాగుంటుంది. ఈ కారణంగా మాంసాహార ప్రియులు ఈ కోళ్లను ఇష్టపడుతున్నారు. ఈ కోళ్ల మాంసానికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కిలో మాంసం ధర రూ.1000 పైనే. అంటే మటన్ ధర కంటే కడక్‌నాథ్ కోడి మాంసం ధరే ఎక్కువ అన్నమాట.
పోషక విలువలు ఎక్కువే..
ధర ఎక్కువైనా మార్కెట్లో కడక్‌నాథ్ మాంసానికి అధిక డిమాండ్ ఉండటానికి కారణం పోషక విలువలే. కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కోడి గుడ్డులో సైతం అత్యధిక ప్రొటీన్లతో పాటు లినోబెయిక్ యాసిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. సాధారణంగా కోళ్లలో కనిపించే వ్యాధులు వీటి దరికి చేరవు.
ఎక్కడైనా బతుకుతాయి..
కడక్ నాథ్ కోళ్లు కేవలం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాక అన్ని ప్రదేశాల్లోనూ జీవించగలవు. చిన్న చిన్న పురుగులతో కడుపు నింపుకోకుండా పోషక విలువలున్న ఆహారం తీసుకుంటాయి. కూరగాయలు, ఆకుకూరలు, రాగులు, సజ్జలు ఇలా వేటినైనా జీరి్ణంచుకోగలవు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కడక్‌నాథ్ కోళ్లు రైతులకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం పౌల్ట్రీ రంగంలో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. అనేక మంది యువ రైతులు కడక్‌నాథ్ కోళ్ల ఫారాలు నిర్వహిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. ఒక్కో కోడి నెలకు 10 నుంచి 18 గుడ్లు పెట్టడం వల్ల తక్కువ సమ యంలో ఎక్కువ పిల్లలు పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతోందని రైతులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం..
పౌల్ట్రీ రంగంలో కడక్‌నాథ్ జాతి కోళ్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ రంగానికి మరింత చేయూత ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కుదేలైన కోళ్ల ఫారాలను తెరిచి కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ జాతి కోడి పిల్లలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కడక్‌నాథ్ కోడి పిల్లలను ఇచ్చే దిశగా సమాలోచన చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి..
కడక్‌నాథ్ జాతి కోళ్లకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. 2017లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి 500 కడక్‌నాథ్ కోడి పిల్లలతో పౌల్ట్రీఫారం ఏర్పాటు చేశాను. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. ఆకుకూరలు, కూరగాయ ముక్కలు మూడు పూటలా ఉంటే చాలు. నాలుగు నెలల వ్యవధిలో కోడి మాంసానికి సిద్ధమవుతుంది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు అమ్ముడుపోతున్నాయి. నా వ్యాపారం లాభాల బాటలో నడుస్తోంది. ప్రభుత్వం మరింత చేయూతనిస్తే మరింత వృద్ధిచెందుతుంది.
– ఇంటి ప్రదీప్, పౌల్ట్రీ యజమాని, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment