‘‘మహిళల్లో నాయకత్వ లక్షణం కొరవడింది. దాన్ని ఈ తరం అమ్మాయిల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. సమాజంలో మన స్థానాన్ని పదిల పర్చుకోవడం కన్నా ముఖ్యమైనది ఇంకోటిలేదు’’ మొన్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ జవాబుతోనే మిస్ సౌత్ ఆఫ్రికా జొజొబిని తుంజి ‘మిస్ యూనివర్స్’ టైటిల్ గెలుచుకున్నారు.
ఈ మాటను నాలుగేళ్ల కిందటే కార్యరూపంలోకి తెచ్చారు ప్రతిభా వనంబత్తిన. తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్రీ బిజినెస్‌పెట్టిన తొలి మహిళా అంట్రపెన్యూర్‌గా నిలిచి! సర్దుకుపోవడం అవసరమే కాని సర్దుకుపోవడమే జీవితం కాకూడదు.. అదే స్త్రీల అస్తిత్వం అవకూడదు అని నిరూపించారు!
ప్రతిభ వనంబత్తిన సొంతూరు విజయవాడ. ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చదివారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తూండగానే పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి). వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదు. దాంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికి పిల్లలు చిన్నవాళ్లు. పుట్టింటి ఆసరా అంతగా లేదు. ఉన్న ఊళ్లోనే ఉంటే బంధువుల సూటిపోటి మాటలు, చిన్నచూపుతో ఉన్న ఆత్మవిశ్వాసం ఆవిరైపోతుందని అర్థమైంది ప్రతిభకు. తన స్నేహితురాలు గీత సహాయంతో ముగ్గురు పిల్లలను తీసుకొని హైదరాబాద్ వచ్చారు.
మళ్లీ ఓ ప్రైవైట్ స్కూల్లో టీచర్‌గా ఉపాధి వెదుక్కున్నారు. మూడేళ్లు గడిచాయి. అప్పుడే హైదరాబాద్‌లో ‘ఎక్స్ వాష్’ అనే బ్రాండ్‌తో లాండ్రి బిజినెస్ మొదలయింది. ఇది 2014 నాటి సంగతి. ప్రతిభ స్నేహితురాలు గీత సలహా ఇచ్చారు ‘‘పిల్లలు పెరుగుతున్నారు. ఈ ఉద్యోగంతో వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? ఎక్స్ వాష్ వాళ్లు ఫ్రాంచైజీలు ఇస్తున్నారట. ఆలోచించు’’ అని. నిజమే అనిపించింది ప్రతిభకు. తను దాచుకున్న సొమ్ము, ఇంకొంత అప్పూ తెచ్చి మొత్తం ‘ఎక్స్ వాష్’ ఫ్రాంచైజీ తీసుకుంది. అయితే ఫ్రాంచైజీ తీసుకునేంతవరకు బిజినెస్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తామని చెప్పిన ‘ఎక్స్ వాష్’ సిబ్బంది తీరా తీసుకున్నాక రెస్పాండ్ అవడమే మానేశారు.
సొంత బ్రాండ్..
అసలే బిజినెస్ కొత్త. ఇంత డబ్బు పెట్టి ఈగలు తోలుకుంటూ కూర్చోవడమేనా అనే బెంగ పట్టుకుంది ప్రతిభకు. అయ్యో అనవసరంగా సలహా ఇచ్చానా ఏంటీ అనే అపరాధభావమేమో ఆమె స్నేహితురాలిలో. ‘‘దిగులు పడితే భయమే తప్ప ఆసరా దొరకదు.. ఏ ధైర్యంతో అడుగువేశానో ఆ ధైర్యంతోనే ముందుకు సాగాలి. ఫ్రాంచైజీ ద్వారా వచ్చిన మెషినరీ ఎలాగూ ఉండనే ఉంది. సొంతంగానే ఈ బిజినెస్‌ను కంటిన్యూ చేస్తే.. అనుభవమో.. లాభమో తేల్చుకోవచ్చు’’అని నిశ్చయించుకున్నారు. ‘‘నాకు మీ ఫ్రాంచైజీ వద్దు. నేను కట్టిన డబ్బులకు మెషినరీ ఇచ్చారు కాబట్టి అక్కడితో చెల్లుకు చెల్లు’’ అని నిర్దంద్వంగా ఎక్స్ వాష్‌వాళ్లతో చెప్పేశారు. సొంతంగా ‘‘లాండ్రి స్పా’’ను ప్రారంభించారు కూడా మధురానగర్‌లో. ఇది 2015లో జరిగింది.
ఆ యేడాదంతా కష్టపడ్డారు ప్రతిభ. ఆమె లాండ్రీ బిజినెస్ చేస్తున్నారని తెలిసిన వాళ్లు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు ఆమెకు వినిపించేలాగానే. అయినా ప్రతిభ పట్టించుకోలేదు.యేడాది గడిచింది. పనిచేస్తూ పని నేర్చుకున్నారు. వ్యాపారంలో మెలకువలూ అర్థమయ్యాయి. ఇంకో ఆర్నెల్లు తిరిగేసరికి లాభాలు రావడమూ మొదలయ్యాయి. ఆ లాభాన్ని మళ్లీ పెట్టుబడిగా పెట్టారు ఆమె. కేవలం డ్రై వాషే కాకుండా దుస్తుల మీది మరకలు పోయేలా, ఫ్యాబ్రిక్, డిజైన్, ఆల్ట్రేషన్.. ఇలా దుస్తులకు సంబంధించి అన్ని సేవలూ ఒకే చోట అందేలా తన ల్యాండ్రీ స్పాను విస్తరించారు. మంచి స్పందనే వచ్చింది. దాంతో హైదరాబాద్‌లోనే మాధాపూర్ నుంచి ‘లాండ్రీ స్పా’ పేరుతో ఫ్రాంచైజీ తీసుకుంటామని వచ్చారు బీటెక్ స్టూడెంట్స్. ఇచ్చారు ప్రతిభ. ఆ తర్వాత యేడాది అంటే 2017లో విజయవాడలోనూ ఒక బ్రాంచ్‌ను మొదలుపెట్టారు. అక్కడా మంచి రెస్పాన్సే వచ్చింది.
అందరూ మహిళలే..
వ్యాపారం విస్తరిస్తున్నకొద్దీ ఉద్యోగుల సంఖ్యనూ పెంచారు ప్రతిభ. అయితే అందరు మహిళలనే తీసుకోవాలని నిర్ణయించుకుని పది, ఇంటర్ విద్యార్హతలున్న స్త్రీలను ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. ఈ వర్క్ మీద ఆసక్తి ఉన్నవాళ్లను ఎంచుకొని స్పోకెన్ ఇంగ్లిష్‌తోపాటు లాండ్రీ స్పాలోనూ శిక్షను ఇప్పించారు. ప్రస్తుతం ఈ ‘లాండ్రి స్పా’ 25 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లోని మ«ధురానగర్‌తోపాటు కొత్తపేట, శ్రీనరగ్‌కాలనీ, విజయవాడలో రెండు బ్రాంచ్‌లతో నడుస్తోంది. ‘‘ఒకప్పుడు శాలరీ తీసుకునేదాన్ని ఇప్పుడు శాలరీ ఇస్తున్నారు. చాలా గర్వంగా అనిపిస్తూంటుంది. ఐడిల్ జాబ్‌ను వదిలేసి ఈ పనేంటి అని నా మొహం మీదే పెదవి విరిచిన వాళ్లు ఇప్పుడు మంచి పనిచేశావ్ సొంతంగా బిజినెస్ పెట్టుకొని.
ఎన్నాళ్లని ఒకళ్లకింద చేయి చాపుతూ ఉంటాం అంటూ మెచ్చుకుంటూంటే మనసులోనే నవ్వుకుంటా. ఒకవేళ నేను చతికిలపడి ఉంటే మేం ముందే చెప్పలేదా అని అనేవాళ్లు. అందుకే ఒకరి ఎంకరేజ్‌మెంట్, డిస్కరేజ్‌మెంట్ మీద ఆధారపడికాదు మన కాన్ఫిడెన్స్‌ను నమ్ముకొని పనిచేయాలి అంటాను. సర్దుకుపోవడం అవసరమే.. కాని సర్దుకు పోవడమే జీవితం అయితే ఎలా? ప్రతి కష్టం కొత్త పాఠం చెబుతుంది. మనలోని కొత్త సామర్థ్యాన్ని చూపిస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం మహిళలకు ఉంటుంది. దానికి నన్ను మించిన ఉదాహరణ లేదు’’ అంటారు ప్రతిభ వనంబత్తిన.
ఆగిపోదు.. కొత్తమలుపు తీసుకుంటుంది
కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్త బాధ్యతలకు భయపడి పారిపోతే ఆ కుటుంబ భారాన్ని మోయడానికి ముందుకు వచ్చేది భార్యే. కూలిపని దగ్గర్నుంచి వ్యవసాయం, వ్యాపారాల దాకా సమర్థవంతంగా నిర్వహిస్తూ తోటివారినీ నడిపిస్తున్నారు. హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్‌గా విస్తృత ఆదరణ పొందిన సంప్రదాయ ఆహారం జొన్నరొట్టెల వ్యాపారం చేస్తోంది తొంభైశాతం మంది మహిళలే. వాళ్లలో చాలామంది ఒంటరి స్త్రీలే. హైదరాబాద్‌లోని వెంకటరమణ కాలనీకి చెందిన విజయ, అనితలే ఇందుకు ఉదాహరణ.
ఈ ఇద్దరిదీ మహబూబ్‌నగర్ జిల్లా. ఒకరిని భర్త వదిలేశాడు. ఇంకొకరి భర్త చనిపోయాడు. సొంత జిల్లాల్లో ఈ ఇద్దరికీ పరిచయం లేదు. పొట్టకూటికోసం పిల్లల్ని చేతబట్టుకొని హైదరాబాద్ వచ్చాకే పరిచయం అయ్యారు ఒకరికొకరు. రోజుంతా ఇళ్లల్లో పనిచేసుకొని.. సాయంకాలం బండి మీద జొన్నరొట్టెల వ్యాపారం పెట్టుకున్నారు చిన్నగా. ఇప్పుడు అదే వాళ్ల ప్రధాన ఉపాధి అయింది. పిల్లల చదువుకు తోడ్పడుతోంది. జీవితం ఆగిపోదు. కొత్త మలుపు తీసుకుంటుంది అంతే. వెదుక్కునే సానుకూల దృక్ఫథం ఉండాలంతే అంటారిద్దరూ!
Comments
Please login to add a commentAdd a comment