Women Estate Planning: All You Need To Know - Sakshi
Sakshi News home page

మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..

Published Mon, Mar 20 2023 9:50 AM | Last Updated on Mon, Mar 20 2023 11:27 AM

Womans estate planning details - Sakshi

మహిళలకు జీవనకాలం పెరిగింది. సంరక్షణ బాధ్యతలు దీర్ఘకాలం పాటు నిర్వహించాల్సి వస్తోంది. ఒంటరి మహిళలు లేదా వితంతువులకూ బాధ్యతలు ఉంటాయి. ఉన్నట్టుండి అమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆమె ఆకాంక్షల మేరకు పిల్లలకు ఆస్తుల బదిలీ ఎలా..? పిల్లల సంరక్షణ ఎలా..? తాను జీవించి ఉండగానే తీవ్ర అనారోగ్యం బారిన పడితే ఆమె సంరక్షణ ఎవరు చూడాలి..? ఆమె తరఫున ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి..? ఇక్కడే ఎస్టేట్‌ ప్లానింగ్‌ కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు కోరుకున్నట్టు, వారి ఇష్టం మేరకు, ఆకాంక్షల మేరకు ఆస్తుల బదిలీ సహా ఎన్నో అంశాలకు చట్టబద్ధమైన రక్షణతో ఎస్టేట్‌ ప్లానింగ్‌ హామీ ఇస్తుంది. ఈ ఎస్టేట్‌ ప్లానింగ్‌ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుందన్నది? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఎస్టేట్‌ ప్లానింగ్‌ డాక్యుమెంట్‌లో ఆస్తులు, అప్పులు ఇలా సమగ్ర వివరాలు ఉంటాయి. స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్, పీపీఎఫ్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇలా సమగ్ర ఆస్తులు, బాధ్యతలు (చెల్లించాల్సిన రుణాలు) అన్నీ వస్తాయి. వారసుల మధ్య వివాదాలను ఇది నివారిస్తుంది. మహిళ కోరినట్టుగా ఆస్తుల పంపిణీ, పన్ను చెల్లింపులతోపాటు, అప్పులను కూడా తీరుస్తుంది. పిల్లలకు అంతగా సామర్థ్యాలు లేవని భావించినప్పుడు, అవసరమైన సందర్భాల్లో ఆర్ధిక, వైద్య అవసరాలను చూసేందుకు నమ్మకమైన ఒక వ్యక్తిని కూడా నియమించుకోవచ్చు. ఎస్టేట్‌ ప్లానింగ్‌ మహిళలను ఆర్థికంగానే కాకుండా బాధ్యతల పరంగా స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. తమకు ప్రియమైన వారు ఇబ్బంది పడకుండా దీర్ఘకాలం పాటు సంరక్షణ బాధ్యతలను కోరిన విధంగా నిర్వహిస్తుంది. 

మహిళలకు తమ పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రత్యేకమైన లక్ష్యాలతోపాటు.. ఆందోళన కూడా ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ప్రాధాన్యతలను నిర్ణయించే అమ్మలూ ఉన్నారు. ఒకవేళ తాము అకాల మరణానికి గురైతే పిల్లలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా ఎస్టేట్‌ ప్లానింగ్‌ భరోసానిస్తుంది. ఒంటరి మహిళ లేదా వితంతు మహిళ వీలునామాలో గార్డియన్‌ పేరు రాస్తే సరిపోతుంది. అదే ఎస్టేట్‌ ప్లాన్‌ అయితే అర్హత లేని వ్యక్తి సంరక్షకుడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఆకాంక్షలు నెరవేరేందుకు..
మహిళలు తమ పేరిట ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు, వాటి సక్రమ బదిలీకి, సరైన వారసులకు తాము కోరుకున్నట్టుగా బదిలీ చేసుకునేందుకు ఎస్టేట్‌ ప్లాన్‌ వీలు కల్పిస్తుంది. వారసులు తేల్చుకోలేకపోతే ఆస్తులపై ప్రయోజనం ఎవరు పొందాలో కూడా ఓ పట్టాన తేలదు. దీంతో కోర్టు కేసులు, ఎన్నో ఏళ్ల కాల హరణం, విపరీతమైన ఖర్చులకు దారితీస్తుంది. మన దేశంలో వారసత్వ చట్టాలు పురుషులకే మొగ్గు చూపిస్తున్నాయి. 

మరణించిన మహిళ ఆస్తులు ఆమె భర్త తరఫు వారికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎస్టేట్‌ ప్లానింగ్‌ ఎంతో అవసరం. ఇది లేకపోతే ఆమె ఆకాంక్షలకు భిన్నంగా ఆస్తుల పంపకాలు జరగొచ్చు. అందుకని వివాహిత మహిళలు అయినా, వితంతువులు అయినా, పెళ్లి కాని మహిళలు అయినా అందరికీ ఎస్టేట్‌ ప్లానింగ్‌ అవసరం. అప్పుడే వారు కోరుకున్నట్టుగా, కోరుకున్న వారికి ఆస్తులు బదిలీ అవుతాయి. 

వీలునామా - ఎస్టేట్‌ ప్లానింగ్‌
ఎస్టేట్‌ ప్లానింగ్‌ అంటే వీలునామా అనుకునేరు. వీలునామా, ఎస్టేట్‌ ప్లానింగ్‌ వేర్వేరు. అలాగే, ఎస్టేట్‌ ప్లానింగ్‌ అంటే ధనవంతులకు, వీలునామా (విల్లు) సామాన్యులకు అనుకునేవారూ ఉన్నారు. కానీ, ఇవి ఫలానా వారికే అని ఏమీ లేదు. వీటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఎస్టేట్‌ అంటే.. ఒక వ్యక్తికి సంబంధించి అన్ని ఆస్తులు, అప్పులు. ఆస్తులు అంటే బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు, పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీ రైట్లు, రియల్‌ ఎస్టేట్, ఆర్ట్‌లు, కళాఖండాలు, వాహనాలు, ఆభరణాలు ఇలా విలువైనవన్నీ వస్తాయి. 

బాధ్యతలు అంటే వ్యక్తిగత రుణాలు, మార్ట్‌గేజ్‌ రుణాలు, క్రెడిట్‌ కార్డులు, పన్నులు వస్తాయి. ఉదాహరణకు.. ఏ అనే వ్యక్తికి కొన్ని పెట్టుబడులు, రూ.కోటి విలువైన ప్రాపర్టీ ఉంది. అలాగే, బీ అనే వ్యక్తి పేరిట ఆరి్థక పెట్టుబడులు, పలు చోట్ల ప్రాపర్టీలు, వ్యాపారాల్లో వాటాలు మొత్తం మీద రూ.500 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి. ఇక్కడ ఏ, బీ ఇద్దరికీ ఎస్టేట్‌ ప్లానింగ్‌ ఉపయోగపడుతుంది.  
   
ఎస్టేట్‌ ప్లానింగ్‌ అనేది రాసిన వ్యక్తి మరణం తర్వాత వారి పేరిట ఉన్న సంపదను బదిలీ చేయడానికే పరిమితం కాదు. జీవించిన ఉన్న సమయంలోనూ వాటిని రక్షించడం, కాపాడుకోవడం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కూడా ఎస్టేట్‌ ప్లానింగ్‌లో ఉంటుంది. విల్లు అనేది సంపదను ఎవరికి, ఎలా పంచాలో సూచించే చట్టబద్ధమైన పత్రం. మరణానంతరం కోరుకున్న విధంగా ఆస్తులను బదిలీ చేసేందుకు ఈ పత్రం ఉపయోగపడుతుంది. విల్లులోని అంశాలను అమలు చేసే బాధ్యతను ఎవరు నిర్వహించాలో కూడా సూచించొచ్చు. విల్లుతో పోలిస్తే ఎస్టేట్‌ ప్లానింగ్‌ మరింత విస్తృతంగా ఉంటుంది. విల్లు ఒక్కటే సాధనం అయితే, ఎస్టేట్‌ ప్లానింగ్‌ ఒకటికి మించిన సాధనాలతో ఉంటుంది.

ఉద్దేశాలు
ఊహించని రిస్క్‌లు ఎదురైతే సంపదకు రక్షణ కవచంలా ఎస్టేట్‌ ప్లానింగ్‌ సాయపడుతుంది. మైనర్లు, ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే, ఆర్ధిక విషయాల గురించి ఏ మాత్రం అవగాహన లేని కుటుంబ సభ్యులు ఉంటే వారికి సంబంధించిన నిర్ణయాలకు ఎస్టేట్‌ ప్లానింగ్‌ హామీ ఇస్తుంది. మహిళ నిర్ణయాలు తీసుకోలేని స్థితికి వెళితే, ఆ బాధ్యతలు నిర్వహించే యంత్రాంగం ఏర్పాటు, కుటుంబ వివాదాలను పరిష్కరించే సమాచార వాహకం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాలకు ఎస్టేట్‌ ప్లానింగ్‌ వేదిక కాగలదు. తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు, ఆసుపత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె తరఫున ఎవరు నిర్ణయం తీసుకోవాలో ఎస్టేట్‌ ప్లానింగ్‌ స్పష్టం చేస్తుంది. 

ఎస్టేట్‌ ప్లానింగ్‌తో ఉన్న ప్రయోజనం వారసత్వ పన్ను తప్పించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం మన దేశంలో వారసత్వ పన్ను లేదు. కానీ, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో ఉంది. తాము ప్రేమించే వారు విదేశాల్లోనూ ఉండి, తమ తర్వాత వారికి కూడా ఆస్తుల బదలాయింపు కోరుకుంటే అప్పుడు ఎస్టేట్‌ ప్లానింగ్‌ మెరుగైనది. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారికి కూడా ఎస్టేట్‌ ప్లానింగ్‌ అవసరం. చివరి వీలునామా, ప్రైవేటు ఫ్యామిలీ ట్రస్ట్, పవర్‌ ఆఫ్‌ అటార్నీ, గిఫ్ట్‌ డీడ్స్, అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ డైరెక్టివ్, లైఫ్‌ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ చార్టర్‌లు ఎస్టేట్‌ ప్లానింగ్‌లో ఉంటాయి. పరిధి చాలా విస్తృతం కనుక నిపుణుల సాయంతో దీన్ని రూపొందించుకోవడం అవసరం. 

మహిళలకు ప్రయోజనం
ఒంటరి మహిళలకు ఎస్టేట్‌ ప్లానింగ్‌ ఎంతో సాయంగా ఉంటుంది. ఎందుకంటే వారి సంరక్షణ బాధ్యతలతోపాటు, వారి తదనంతరం అన్ని అప్పులు తీర్చేసి, మిగిలిన ఆస్తులను వారు కోరిన మేరకు వారికి ఎంతో ఇష్టమైన వారికి సాఫీగా పంపిణీ అవుతాయి. రెండు రకాల ప్రయోజనాలకు ఇది భరోసా ఇస్తుంది. అందుకే ఇక్కడ మహిళలను ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఎస్టేట్‌ ప్లానింగ్‌ రూపొందించడం వల్ల మహిళలకు అన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. అన్ని ఆస్తులు, అప్పులు, అవసరాలపై స్పష్టత వస్తుంది. ఒక విధంగా అన్ని వైపులా ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణనిస్తుంది.

పన్నుల భారం
ఆస్తులపై పన్నుల భారాన్ని ఎస్టేట్‌ ప్లానింగ్‌ తప్పిస్తుంది. అంతేకాదు, ఒకరి మరణానంతరం ఎస్టేట్‌ ప్లానింగ్‌లో పేర్కొన్న మాదిరి ఆస్తులను పింపిణీ చేసుకున్నప్పుడు వాటిపై వ్యయాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆస్తులపై పన్ను తగ్గుతుంది. విచారణ లేకుండానే (చట్టపరమైన ప్రక్రియ) లబి్ధదారులు ఆస్తులు పొందగలరు. ఎస్టేట్‌ ప్లానింగ్‌లో సూచనల మేరకు ఆస్తులను వేగంగా బదిలీ చేయవచ్చు.

ప్రయోజనాలు.. పరిమితులు.. వ్యత్యాసాలు
తమ ఆస్తులు తమ తదనంతరం ఎవరికి చెందాలో విల్లులో రాసుకోవచ్చు. విల్లు లేకుండా మరణిస్తే.. అనుభవించే హక్కులు మారొచ్చు. ఉదాహరణకు హిందూ పురుషుడు విల్లు లేకుండా మరణిస్తే అతడి పేరిట ఉన్న సంపదను అతడి తల్లి, భార్య, పిల్లలు ఇలా మూడు సమాన వాటాలుగా పొందొచ్చని చట్టం చెబుతోంది. కానీ, విల్లు రాస్తే సంబంధిత వ్యక్తి కోరుకున్న విధంగా ఆస్తుల బదిలీకి అవకాశం ఏర్పడుతుంది. విల్లు వ్యక్తి మరణానంతరమే అమల్లోకి వస్తుంది. అంతేకాదు, ఈ విల్లును వారసులు సవాల్‌ చేయవచ్చు. 

ఎస్టేట్‌ ప్లానింగ్‌ సమగ్ర రూపంతో ఉంటుంది. మరణానంతరమే కాకుండా జీవించిన కాలంలోనూ లక్ష్యాలకు రూపం ఇస్తుంది. ఎస్టేట్‌ ప్లానింగ్‌ మీ సంపదకు, మీ వారసులు లేదా మీకు ఇష్టమైన వారి ఆరి్థక భద్రతకు ఎక్కువ రక్షణనిస్తుంది. కేవలం చట్టబద్ధమైన డాక్యుమెంట్లకే పరిమితం కాకుండా, అన్ని రకాల బాధ్యతలు, సంరక్షణ, సంపద బదిలీ యంత్రాంగం ఏర్పాటు ఇందులో ఉంటాయి. కనుక విల్లుతో పోలిస్తే ఎస్టేట్‌ ప్లానింగ్‌ అదనపు ఖర్చు భరించాల్సిందే. ఎస్టేట్‌ ప్లానింగ్‌ మహిళల కోసమనే కాదు. పురుషులకూ, ఇంటి బాధ్యతలు చూసే, ఆస్తులు, బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే డాక్యుమెంట్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement