Miss World 2023: ప్రతిభావంతులైన ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ పోటీలు ఈ సారి ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1996 తరువాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఈ పోటీలను గురించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో 'జూలియా మోర్లే' (Julia Morley) వెల్లడించారు.
భారతదేశంలో జరగనున్న ఈ పోటీలలో మన దేశం తరపున మిస్ వరల్డ్ 'సినీ శెట్టి' (Sini Shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో మొత్తం 130 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీలలో భాగంగా పాల్గొనే అందగత్తెల ప్రతిభ, సేవా దృక్పథం, క్రీడలలో వారికున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని రౌండ్స్ నిర్వహిస్తారు. అన్ని రౌండ్స్‌లో ముందున్న వారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు.
భారతదేశం ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966లో మొదటి సారి ఇండియాకి చెందిన 'రీటా ఫరియా' మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత 1994లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, 1997లో డయానా హైడెన్, 1999 యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటాన్ని దక్కించుకునే విశ్వ సుందరి ఎవరో తెలియాల్సి ఉంది.
భారతదేశం ఆథిత్యమివ్వనున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నియమాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..
నిజానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్థానిక లేదా జాతీయ అందాల పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోటీకి సన్నద్ధం కావడానికి ఒక కోచ్‌ని ఎంచుకోవాలి. మిస్ వరల్డ్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ముందుగానే అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి.
(ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..)
నియమాలు
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలనుకునే వారు అవివాహితులై ఉండాలి. వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి వారు ఈ పోటీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దేశాన్ని బట్టి మారే కట్-ఆఫ్ తేదీలను ఖచ్చితంగా ద్రువీకరించాలి. పోటీలు జరిగే నాటికి మీకు నిర్దేశించిన వయసు తప్పకుండా ఉండాలి. జరిగే పోటీలు 'మిస్' అని ఉంటాయి కావున వివాహితులు పోటీ చేయడానికి అనర్హులు.
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వ్యక్తికి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏ దేశం నుంచి పోటీ చేస్తున్నారో ఆ దేశం పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి. 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే దాన్ని బట్టి బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. కావున ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే మహిళలు ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వ్యక్తుల కోసం డబ్బు లేదా అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్‌లను నిర్వహించి ఉండాలి. డ్యాన్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి.
మోడలింగ్ పోటీలలో పాల్గొనే వారు వస్త్ర ధారణ, ర్యాంప్ వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. అన్ని అంశాలలోనే ఉత్తమ ప్రతిభను కనపరచిన వారిని విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు.
(ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ)
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్లోజ్ అప్, మిడ్ లెంత్, ఫుల్ లెంత్ & మేకప్ లేకుండా ఉండే నాలుగు పోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి.
- వ్యక్తిగత రుజువు కోసం పాస్‌పోర్ట్ ప్రధానం. లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి.
- మీ ఎత్తుకి సంబంధించిన ఖచ్చితమైన కొలతల కోసం VLCC కేంద్రాన్ని సందర్శించాలి.
- మీ ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి
- సైన్ ఇన్ చేసుకున్న తరువాత 2 వేర్వేరు ఆడిషన్ టాస్క్ వీడియోలను అప్‌లోడ్ చేయండి (పరిచయానికి సంబంధించిన వీడియో & రాంప్‌వాక్ వీడియో). వీడియో పరిమితి 60 సెకన్లు వరకు మాత్రమే ఉండాలి.
- మొదటి మూడు దశలలో మీ ఫోటోలను, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- అప్లై చేసుకోవడానికి రూ. 2999 + ట్యాక్స్ వంటివి చెల్లించాలి.
- ఆతరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ అందుకున్న కోడ్ ఎంటర్ చేసుకోవాలి.
- అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత T&Cలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది.
అప్లై చేసుకోవంలో ఎలాంటి సందేహం ఉన్నా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య +91 9619937295 / +91 7039464909 నెంబర్‌కి కాల్ చేయవచ్చు, లేదా missindiaorg@timesgroup.comని సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment