అమలాపురం టౌన్ : జిల్లాలో వ్యాపారవర్గాలు పోరుబాట పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యాపార వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు వ్యాపార సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. జిల్లాలోని బంగారు వర్తక సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఆందోళనలో భాగస్వాములవుతున్నాయి. ఇప్పటికే బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంగారు వర్తక సంఘాలు గత వారం రోజులుగా బంగారు దుకాణాల్ని మూసివేసి, సమ్మె చేస్తున్నాయి. జిల్లాలో ఉన్న 12 బులియన్ అసోసియేషన్లు ఆ బాటలోనే నడుస్తూ, వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నాయి.
కాగా బంగారు వర్తకుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూనే మరోపక్క వాణిజ్య పన్నుల శాఖ వ్యాపార వ్యతిరేక విధానాలు, ఆ శాఖ అధికారుల వేధింపులను నిరసిస్తూ జిల్లాలోని 17 చాంబర్ ఆఫ్ కామర్స్‌లు గురువారం బంద్‌కు సంకల్పించాయి. రెడీమేడ్ దుస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధించటంతో జిల్లాలోని వస్త్ర వ్యాపారులు ముఖ్యంగా రెడీమేడ్ దుస్తుల దుకాణాల యజమానులు ధ్వజమెత్తుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యాపార వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నందుకే జిల్లాలోని అన్ని చాంబర్ ఆఫ్ కామర్స్‌లు ఉమ్మడి పోరుకు దిగాయని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ అన్నారు.
వారం రోజులుగా విస్తృత ప్రచారం
ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ విధానాల వల్ల కిరాణా వర్తకులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో భాగస్వాములైన కిరాణా వర్తక సంఘాలు కూడా గురువారం నాటి బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తూ దుకాణాలు మూసివేయనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, పెద్దాపురం తదితర ముఖ్య ప్రాంతాల్లోని బులియన్ అసోసియేషన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లు గత వారం రోజులుగా జిల్లాలో గురువారం వర్తక బంద్ విజయవంతానికి ఆయా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, లౌడ్ స్పీకర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశాయి. ప్రభుత్వ విధానాలను, తమ బంద్‌కు, సమ్మెకు కారణాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి, ప్రజలకు పంపిణీ చేశాయి. జిల్లాలో నేటి బంద్‌లో దాదాపు 2,500 మంది బంగారు వర్తకులు, 18 వేల మంది స్వర్ణకారులు, కార్మికులు పాల్గొంటున్నారు. దాదాపు రెండు వేల బంగారు దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. అన్ని వ్యాపార వర్గాలకు సంబంధించి జిల్లాలో గురువారం దాదాపు 15 వేలకు పైగా దుకాణాలు మూతపడనున్నాయి.
నేడు వ్యాపారుల ర్యాలీలు, ధర్నాలు
జిల్లాలోని బులియన్ అసోసియేషన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లు, ఇతర వ్యాపార సంఘాలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆర్డీవో, తహశీల్దార్లకు ఇవ్వనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని తదితర ప్రాంతాల్లో వ్యాపార సంఘాలన్నీ ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అమలాపురం బులియన్ అసోసియేషన్, రెండు చాంబర్ ఆఫ్ కామర్స్‌లు, కోనసీమ కిరాణా చాంబర్ ఆఫ్ కామర్స్‌ల ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటరులో తొలుతు నిరసన తెలిపి ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందించనున్నారు.
మందుల షాపులకు మినహాయింపు
గురువారం జిల్లాలో దాదాపు అన్ని రకాల దుకాణాలు మూతపడనుండటంతో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. లావాదేవీలు స్తంభించటం వల్ల రూ.100 కోట్లకు పైగా వ్యాపారం నిలిచిపోనుందని అంచనా. అయితే రోగులకు అవస్థ కలగకుండా బంద్ నుంచి మందుల దుకాణాలను మినహాయించారు. జిల్లావ్యాప్త బంద్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమరపథంలో వ్యాపారులు
Published Thu, Mar 17 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement