బస్సులు ఖాళీ
హైదరాబాద్‌కు తగ్గిన రాకపోకలు
ఆరుశాతం తగ్గిన ఆక్యుపెన్సీ
ప్రైవేట్ బస్సుల్లోనూ ఇదే పరిస్థితి
ఆదివారమూ అంతే సంగతులు
రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌కు అంతరం పెరిగింది. విజయవాడ నుంచి భాగ్యనగరికి రాకపోకలు తగ్గిపోతున్నాయి. గతంలో నిత్యం వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారుు. హైదరాబాద్ బస్సులు ఖాళీగా తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం తగ్గడమే కాదు..ఆదాయానికీ భారీగానే గండి పడుతోంది.
విజయవాడ : నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు రోజూ 240 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నారుు. రాత్రివేళల్లో సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నారుు. వీటిద్వారా సుమారు 12వేల నుంచి 14వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వారాంతాల్లో మరో 20 శాతం ప్రయాణికులు అదనంగా ఉంటారు. ఇవికాకుండా వివిధ రైళ్లలో నిత్యం మరో రెండువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో నగరం నుంచి హైదరాబాద్‌కు రోజుకు సగటున వెళ్లే వారి సంఖ్య మూడువేలకు తగ్గింది. ప్రజల్లో పొరుగు రాష్ట్రం అనే భావన రావడం, హైదరాబాద్‌కు వెళ్లకుండానే ఇక్కడే సాధ్యమైనంత వరకు పనులు పూర్తిచేసుకునే యత్నాలు చేస్తున్నారు. దీంతో రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇటు ఆర్టీసీకి, అటు ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయానికీ గండిపడింది.
ఆరు శాతం తగ్గిన ఆక్యుపెన్సీ
విజయవాడ బస్టాండ్ నుంచి రోజూ రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సుమారు 2,500 వరకు సర్వీసులు నడుస్తారుు. ఇవికాక జిల్లాలోని 14 డిపోల నుంచి నుంచి పల్లెవెలుగు బస్సులతో కలిపి 1,200 వరకు సర్వీసులు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్, ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కచ్చితంగా 65 శాతంపైన, పల్లెవెలుగు బస్సులకైతే 50 శాతంపైన ఉండాలి. హైదరాబాద్ బస్సులకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ ఉంటున్నప్పటికీ గతం కంటే కొంత తగ్గిందనే చెప్పొచ్చు. గడిచిన రెండు నెలల్లో 80 నుంచి 77 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ఈ నెలలో 72 శాతానికి పడిపోయింది. ఆదివారాలు అయితే గతంలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు ఆదివారాల్లో కూడా 80 నుంచి 85 శాతానికి మించి ఉండట్లేదు. నవంబర్ నుంచి ఆక్యుపెన్సీ సగటున నాలుగు శాతం నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆరు శాతంగా ఉంది. దీనివల్ల ఆర్టీసీకి ప్రత్యక్షంగా సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే 240 బస్సుల్లో జిల్లా, నగరంలోని డిపోల నుంచే అత్యధికంగా 175 వరకు వెళుతున్నాయి.
ప్రత్యామ్నాయం దిశగా ఆర్టీసీ
ఆర్టీసీ అధికారులు తగ్గిన ఆక్యుపెన్సీని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో స్పెషల్ బస్సులు ఏర్పాటుచేసి ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ తగ్గడంతో రాకపోకలు తగ్గాయనేది సుస్పష్టం. మరోవైపు ప్రైవేట్ బస్సులదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌కు రద్దీ తగ్గిపోవడంతో ప్రైవేట్ బస్సులను బెంగళూరు, చెన్నైకు రూట్ మార్చి తిప్పుతున్నారు. గతంలో అయితే సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ వెళ్లేవి. ఇప్పుడు వాటిలో 10 నుంచి 20 బస్సులు తగ్గాయి.