బొమ్మ పడిందా.. కేసులూ కాసులే! | Traffic Regulation | Sakshi
Sakshi News home page

బొమ్మ పడిందా.. కేసులూ కాసులే!

Published Fri, Mar 6 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

బొమ్మ పడిందా.. కేసులూ కాసులే!

బొమ్మ పడిందా.. కేసులూ కాసులే!

డిజిటల్ కెమెరాలతో పోలీసుల హల్‌చల్
వాహనాలను ఫొటోలు తీస్తున్న వైనం
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గాలికి
వాహనచోదకులకు కొత్త కష్టాలు

 
‘ఏయ్ ఆటో ఆపు.. బండి నంబరెంత..! చేతిలో ఉన్న చిన్నపాటి యంత్రాన్ని (పీడీఎఫ్ డివైస్) టకటకా నొక్కి.. ఇదిగో 2013 నుంచి ఇప్పటివరకు నీ ఆటో ఇన్నిసార్లు నిబంధనలను అతిక్రమించింది. రెండు వేల రూపాయలు జరిమానా కట్టు’ .. ఇది ఓ పోలీస్ అధికారి హుకుం.

‘అదేంటి సార్.. నేనీ ఆటో కొనుక్కుని నాలుగు నెలలే అయింది.. 2013 నుంచి ఫైన్ కట్టమంటే ఎలా! ఈ నాలుగు నెలల్లో  నేనెప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదు. ఒకవేళ మీరినా అప్పటికప్పుడే ఆపి జరిమానా రాస్తే కట్టేసేవాళ్లం కదా.. ఇదెక్కడి అన్యాయం సార్’ .. ఇది ఓ ఆటోడ్రైవర్ ఆవేదన.
 
భవానీపురం :  ఇది ఒక్క ఆటోడ్రైవర్ వాదన, ఆవేదనే కాదు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు డిజిటల్ కెమెరాలతో చేస్తున్న హడావుడితో  హడలెత్తిపోతున్న వాహనచోదకులందరిదీ. పోలీసులు ఎప్పుడు ఫొటో తీస్తున్నారో తెలియదు.. ఎందుకు తీస్తున్నారో తెలియదు. ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట ఉన్నట్లుండి వాహనాన్ని ఆపుతున్నారు. పోలీసు అధికారి చేతిలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే యంత్రం లాంటిది ఒకటుంటుంది. మీ వాహనం నంబర్ చెప్పండంటారు. చెప్పగానే టక టక కొట్టేసి.. ఇదిగో ఇన్నిసార్లు మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు.. ఇంత మొత్తం జరిమానా కట్టాలి.. అంటూ వాహనదారుడి చేతిలో చిన్న స్లిప్పు పెట్టేస్తున్నారు.
 
కనిపించని నాలుగో సింహం

నగరంలోని పోలీసుల తీరు చూస్తుంటే ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అనే సినీ డైలాగ్ గుర్తురాక మానదు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో పోలీసులు ఎవరికీ తెలియకుండా ఫొటోలు తీస్తుంటే.. కొన్ని కూడళ్లలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తమ చేతిలోని డిజిటల్ కెమెరాతో ఎవరికీ అనుమానం రాకుండా వాహనదారులను ఫొటోలు తీస్తున్నారు. ఆఫీసులు, ఆస్పత్రుల వంటి ముఖ్యమైన పనులకు వెళ్లే హడావుడిలో ఉండే ద్విచక్రవాహనదారులు, కిరాయి వేటలో ఉండే ఆటో డ్రైవర్లకు పోలీసులు ఫొటోలు తీసిన విషయమే తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు పంపిస్తున్న జరిమానా నోటీసులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఒక్కో కూడలిలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఎవరికి వారు ఫొటోలు తీసేస్తున్నారు. కొందరైతే డ్యూటీ వదిలేసి పక్క రోడ్‌లో పార్క్ చేసిన ద్విచక్రవాహనాల ఫొటోలను తీస్తున్నారు. ఎక్కడైనా రోడ్డుపై హఠాత్తుగా ఆటో ఆపితే అమాంతం ఫొటో తీస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇక వారు ఫొటోలపై పెట్టే శ్రద్ధ ట్రాఫిక్‌పై ఏం పెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాసులు కురిసేదెలా అంటే.. డిజిటల్ కెమెరాతో ఎన్ని ఫొటోలు తీసినా తొలగించే (డిలీట్ చేసే) వీలుంటుంది. ఇది పోలీసులకు కాసులు కురిపిస్తోంది. ఏదేనీ వాహనాన్ని ఫొటో తీయడం ఆ వ్యక్తి గమనిస్తే జరిమానా కట్టేందుకు మక్కువచూపడం లేదు. ఎంతో కొంత సొమ్ము సదరు కానిస్టేబుల్‌కో, హోంగార్డుకో ముట్టజెప్పి ఫొటోను తొలగింపజేసుకుంటున్నారు.

సూచికలు లేకుండా జరిమానాలా.. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సూచికలు పలుచోట్ల కనిపించడం లేదు. అలాంటప్పుడు జరిమానా ఎలా విధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల వన్‌వే, నో పార్కింగ్, బస్‌స్టాప్ వంటి సూచిక బోర్డులు లేవు. మరికొన్ని జంక్షన్లలో జీబ్రాలైన్లు వెలిసిపోయి కనిపించడం లేదు. అయినా పోలీసులు ఫొటోలు తీసేస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement