సాక్షి, సిటీబ్యూరో:
ఏపీ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తరఫున ఏపీఎన్జీఓలు బుధవారం ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్‌లో నిర్వహించతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ధర్నా నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరాపార్క్ రోడ్డుతో పాటు అసెంబ్లీ చుట్టుపక్కలా ఇవి బుధవారం ఉదయం 6 నుంచి అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు.
నిరంకారి వైపు నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వాహనాలను ద్వారకా హోటల్ నుంచి ఇక్బాల్ మీనార్, మాసబ్‌ట్యాంక్ వైపు పంపిస్తారు
నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా మళ్లిస్తారు
అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఐటీ లైన్‌లోకి వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి దారి మళ్లిస్తారు
లిబర్టీ, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, మోర్ మెడికల్ హాల్ వైపు నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వచ్చే వాహనాలను క్రిస్టల్ లైన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వైపు పంపిస్తారు
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠిల వైపు నుంచి పాత కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ, బీజేఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు
బషీర్‌బాగ్ వైపు నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వెళ్లే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ, జీపీఓ వైపు పంపిస్తారు
ఆదర్శ్‌నగర్-కట్టమైసమ్మ దేవాలయం మధ్య ఉన్న మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు.
ఆర్టీసీ సిటీ, సెట్విన్ బస్సుల్నీ ఈ మార్గాల్లోకి అనుమతించరు. ఇతర జిల్లాల బస్సుల్ని జేబీఎస్, ఎంజీబీఎస్, మెహిదీపట్నం, లింగంపల్లి వరకే అనుమతిస్తారు
సిటీ బస్సులు మాసబ్‌ట్యాంక్/మెహిదీపట్నం, వీవీ స్టాట్యూ/పంజగుట్ట, ఖైరతాబాద్, కర్బాలా మైదాన్/సీటీఓ/తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్దే ఆపాల్సి ఉంటుంది
పార్కింగ్ ప్రాంతాలివి...
ధర్నాకు వచ్చే వారికి ఎన్టీఆర్ స్టేడియం, నెక్లెస్‌రోడ్, కులీకుతుబ్‌షా స్టేడియం, సీఏఆర్ హెడ్-క్వార్టర్స్, సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ రైల్వే గ్రౌండ్స్‌లో పార్కింగ్ కేటాయించారు.
పటిష్ట బందోబస్తు
నిరసనకారులతో సహా అనుమతి లేని వారెవ్వరూ అసెంబ్లీ వైపు దూసుకురాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు
బుధవారం బందోబస్తు విధుల్లో దాదాపు ఆరు వేలకు పైగా సిబ్బంది పాల్గొంటారు
ఉస్మానియా యూనివర్శిటీ చుట్టపక్కల ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు
నగర వ్యాప్తంగా పకడ్బందీ నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు
అసెంబ్లీ, సచివాలయం చుట్టూ రెండు కిమీ పరిధిలో బారికేడ్లు, పికెట్లు, కంచె ఏర్పాటు చేస్తున్నారు
కీలక కూడళ్లలో పికెట్లతో పాటు మధ్య మండల పరిధిలోని ప్రాంతాల్లో 20, నగరంలో 35 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న చోటికి అనుమానితులు ప్రవేశించకుండా అసెంబ్లీకి 3 కి.మీ. పరిధి వరకు నిఘా ఉంచేలా కార్డన్ ఏరియాలు, ఇంటరప్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
Published Wed, Jan 22 2014 1:55 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement