జిల్లా వ్యాప్తంగా పాత్రికేయుల నిరసన
విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, వీడియో జర్నలిస్టులపై తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తం గా సోమవారం పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. దాడిచేసిన వారిని కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మదనపల్లె: అమరావతి భూ కుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి బండపల్లి అక్కులప్ప అన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అక్కులప్ప మాట్లాడుతూ అమరావతి భూ కుంభకోణం విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి జర్నలిస్టులను ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఏ ఆధారాలతో జర్నలిస్టులు వార్తలు రాశారంటూ ప్రశ్నించిన ప్రభుత్వం ఇది ఒక్కటేనని విమర్శించారు. ఇటీవల కాలంలో రాష్ర్టంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భౌతిక దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై నాన్ బెయిబుల్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులకు భద్రత కరువైందన్నారు. దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కృతికాబాత్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్యక్ష కార్యదర్శులు రమేష్, రాజు పట్టణంలోని ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.