
సాక్షి, విజయవాడ : అధికార పార్టీ నేతల పుత్రరత్నాలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ గత రాత్రి కారు రేసులో ఓ బైక్‌ను ఢీకొట్టి, పైపెచ్చు బాధితుల్ని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఇంతవరకూ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.
గతంలో బోండా ఉమ, రావెల కిషోర్ బాబు, నిమ్మల కిష్టప్ప కుమారులు అరాచకాలకు పాల్పడ్డారని, అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తుగా మారారని వైఎస్‌ఆర్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. మద్యం, జూదం, కారు రేసుల్లో ఆంధ‍్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నగరంలో అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు కారు రేసులు, బైక్ రేసుల నిర్వహించడం వల్లే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్నారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment