కొవ్వూరు కుర్రాడికి అవార్డుల పంట | Trainee IFS Officer Sekhar babu gets 6 Awards from Central Government | Sakshi
Sakshi News home page

కొవ్వూరు కుర్రాడికి అవార్డుల పంట

Published Mon, Aug 31 2015 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

Trainee IFS Officer Sekhar babu gets 6 Awards from Central Government

కొవ్వూరు (పశ్చిమగోదావరి) : కొవ్వూరుకి చెందిన ఆంధ్ర ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారి గెడ్డం శేఖర్‌బాబుకు రెండేళ్ల శిక్షణాకాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఉత్తమ ట్రైనీ అవార్డుతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించిన మరో ఆరు అవార్డులను సొంతం అయ్యాయి. 2013 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కి చెందిన శేఖర్‌బాబు రెండేళ్ల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో సోమవారం స్నాతకోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆల్ రౌండర్ ఔట్‌స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్ అవార్డు(అత్యుత్తమ ట్రైనీ అధికారిగా)ను, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా టాపర్ ఇన్ కోర్ ఫారెస్టెరీలోను బంగారు పతకం అందుకున్నారు. పి.శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు, డాక్టర్ బీఎన్ గంగూలీ అవార్డు తోపాటు రూ.25వేలు నగదు పారితోషికం అందుకున్నారు.

ఆర్‌ఎన్ మాతుర్ మెమోరియల్ అవార్డు, సీనియర్ ఫారెస్టరీ అవార్డు, కేపీ సాంగీయా వినికి అవార్డు ఫర్ బెస్ట్ ట్రైనీ అధికారి అవార్డును శేఖర్‌బాబు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రి జయదేవకర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. అకడమిక్ ఎక్స్‌లెన్స్(ప్రతిభ), ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ లా, కోర్ ఫారెస్టరీ సబ్జెక్ట్స్, అటవీ ఉత్పత్తుల విభాగం, ఫీల్డ్ ఫారెస్టరీ తదితర అంశాలలో శేఖర్ బాబు ఈఅవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో కేంద్ర పర్యావరణ కార్యదర్శి అశోక్ లవాస, అకాడమీ డెరైక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్ధలో కందిసాగులో అధిక దిగుబడులను ఇచ్చే జన్యువులను గుర్తించినందుకు పీహెచ్‌డీతో పాటు గోల్డ్‌మెడల్‌ను శేఖర్‌బాబు దక్కించుకున్నారు. శేఖర్‌బాబు తండ్రి శంకర్రావు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి సువర్ణ గృహిణి. తమ కుమారుడు ఐఎఫ్‌ఎస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు సొంతం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement