ట్రాన్స్‌కో.. మేలుకో!
కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు
పెచ్చులూడి న స్తంభాలు
చేతికి అందేలా ట్రాన్స్‌ఫార్మర్లు
పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
పెనుమూరు : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం గ్రామీణ ప్రజలకు సంకటంగా మారింది. పెనుమూరు మండలంలో పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు, స్తంభాలకు, లైన్లకు పచ్చని తీగలు అల్లుకుంటున్నాయి. దీనికితోడు లూప్‌లైన్స్ కారణంగా చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందినా, ఆఖరుకు మనిషి చనిపోయినా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
నంజరపల్లె, కలికిరి గొల్లపల్లె, యల్లంపల్లె, లక్కలపూడి వాండ్లవూరు, రామక్రిష్ణాపురం ప్రాంతాల్లో చేతికి తగిలేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు స్టే వైర్లు లేక ఓ వైపునకు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ స్తంభాలు ఎప్పు డు కూలుతాయో అని ప్రజలు భయపడుతున్నారు.గుడ్యాణంపల్లె, కొటార్లపల్లె, ఎర్రమట్టిపల్లె, విడిదిపల్లె, గుంటిపల్లె, పులికల్లు ప్రాంతాల్లో హెచ్‌డీఎఫ్‌సీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు, వైర్లకు పచ్చని తీగలు అల్లుకున్నాయి.
పెద్దకలికిరిలో తీగలు విద్యుత్ వైర్లకు అల్లుకుని ఉన్న కారణంగా ఇటీవల ఓ పశువు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. కలికిరి గొల్లపల్లెలో చేతులకు అందేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. గాలికి విద్యుత్ తీగలు ఒక్కటై మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయం ట్రాన్స్‌కో అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకకుండా గ్రామస్తులు కర్రలు ఏర్పాటు చేశారు.కొన్ని చోట్ల లూప్‌లైన్లు ఉండటంతో కర్రలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ గతంలో ఓ మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది.
గొడుగుమానుపల్లె, సాతంబాకం, కలవగుంట ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పెచ్చులు ఊడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మామిడి, తమలపాకు, చెరకు తోటలకు విద్యుత్ తీగలు తగులు తున్నాయి. చిన్నకలికిరిలో విద్యుత్ లైన్లు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. రెండు నెలల క్రితం జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. వెంటనే విద్యుత్ లైన్లు సరిచేయాలని ఆదేశించారు. ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వీడాల్సి ఉంది.