బదిలీల భయం..! | transfers in government employees | Sakshi
Sakshi News home page

బదిలీల భయం..!

Published Sat, Aug 23 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

transfers in government employees

సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది. అధికార పార్టీ నేతల లేఖ, ఉప ముఖ్యమంత్రి సిఫారసు.. ఉంటే తప్ప అనువైన ప్రాంతానికి స్థానచలనం దక్కదనే ఆందోళన మొదలైంది. పాత పాలకుల ప్రభావం పోయి అంతా కొత్త మార్పులు రావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఇవన్నీ రాజకీయంగా జరగబోనున్నాయనే వాదన వినిపిస్తోంది.

 సెప్టెంబరు 30వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో జిల్లాలోని ఉద్యోగులందరిలో బదిలీల భయం పట్టుకుంది. జీవో నంబరు 175 ప్రకారం ఒకేచోట మూడేళ్లు పూర్తి చేసుకున్నవారందరికీ స్థానచలనం తప్పని సరి. ముఖ్యంగా మినిస్టీరియల్ సిబ్బందిలో బదిలీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని శాఖల పరిధిలో దాదాపు 20 వేల మందికి స్థానచలనం లభించే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే ప్రతి బదిలీ వెనుక తప్పని సరిగా రాజకీయ ప్రభావం ఉండేవిధంగా వ్యవహారం సాగుతోంది.

 సిఫారసుల కోసం పడిగాపులు...
 తమను ఎక్కడకు బదిలీ చేస్తారో అంటూ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులకు స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేల నుంచి లేఖలు తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట పార్టీ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయిన వారి సిఫారసు లేఖలు తీసుకునేందుకు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రధానంగా జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేఖ కోసం నానా హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు సిఫారసు చేస్తే తప్ప ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫారసు లేఖలు విడుదల కాని పరిస్థితి. దీంతో ఉద్యోగులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండే నాయకుల చుట్టూ ప్రదక్షిణం మొదలైంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇలా చేయకపోవడంతో బదిలీల సాధకబాధకాలను పరిశీలించకుండా రాజకీయ ఒత్తిళ్ల ప్రకారమే జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు 30 కల్లా బదిలీల ప్రక్రియ పూర్తయి అక్టోబరు ఒకటి నుంచి తిరిగి నిషేధం అమలులోకి వస్తుంది.  డాక్టర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం వైద్య, విద్య, ఉన్న విద్య శాఖలు కొన్ని మార్గదర్శకాలు పంపింది. వాటి ప్రకారమే నడుచుకునే అవకాశం ఉంది. ఆయా శాఖల సిబ్బందికి మాత్రం రాజకీయ ప్రభావం తప్పే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement