Transfers of employees
-
రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు. -
AP: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కేరళ కేడర్‌కు చెందిన మైలవరపు కృష్ణతేజను పంచాయతీరాజ్–గ్రామీణీభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమించారు.స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఎంవీ శేషగిరిబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్‌బాబును నియమించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీఎండీగా శ్రీధర్‌బాబుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్ సీఈఓగా జి. వీరపాండియన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణణ్ను నియమించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా సీహెచ్ హరికిరణ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. బదిలీల పూర్తి వివరాలు ఇవీ.. -
40 శాతమే అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ప్రభుత్వ శాఖలు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల వారీగా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీచేసే పనిలో బిజీ అయ్యాయి. వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు 2018లో జరిగాయి. ఆ తర్వాత జీఓ 317 కింద జరిగిన కేటాయింపులు, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలు మినహా ఉద్యోగులకు స్థానచలనం కలగలేదు. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. 40 శాతం మించి ఉద్యోగులకు బదిలీలు చేయొద్దని స్పష్టం చేయడంతో, సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న వారికి తాజా బదిలీలు నిరాశ కలిగిస్తాయనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. సీనియర్లకే అవకాశం... ఒక ఉద్యోగి ఒకస్థానంలో గరిష్టంగా నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో వరు సగా నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తే వారు తప్పకుండా బదిలీ కావాల్సి ఉంటుంది. 40 శాతం మించొద్దని చెప్పడంతో తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న చాలామంది ఉద్యోగులకు స్థానచలనం కష్టమని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి, మలీ్టజోనల్, జోనల్, జిల్లా కేడర్‌లో బదిలీలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేడర్ యూనిట్ ప్రకారం బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాను సంబంధిత శాఖలు ప్రకటిస్తాయి. 40 శాతం మాత్రమే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం జిల్లా కేడర్‌లో 10 మంది ఉద్యోగులు ఉంటే అందులో కేవలం నలుగురు మాత్రమే బదిలీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగి దాదాపు ఆరేళ్లు కావొస్తుంది. దీంతో నాలుగేళ్లు సర్వీసు దాటిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తే పనిచేస్తున్న వారిలో మెజారిటీ శాతం తప్పనిసరి బదిలీ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ 40శాతం మందికి అవకాశం కల్పిస్తే కేవలం కొందరు సీనియర్లకు మాత్రమే స్థానచలనం కలుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఆర్టర్ టు సర్వ్ ప్రాతిపదికన పలు జిల్లా కార్యాలయాల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సాధారణ బదిలీల కోసం వారంతా ఎదురు చూస్తుండగా... ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరిలో మెజారిటీ ఉద్యోగులకు తాజా బదిలీల్లో అవకాశం కలగుతుందా? లేదా? వేచి చూడాలి. అయితే 40శాతం నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ కూడా ఉద్యోగవర్గాల నుంచి వినిపిస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా, తప్పనిసరి బదిలీల జాబితా వెలువడేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఈలోపు ఎంతమందికి బదిలీల్లో అవకాశం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
బదిలీల మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శకాలు రాజ్యాంగంలోని అధికరణ 309 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదని, అందువల్ల ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్న ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. అధికరణ 309 ద్వారా మార్గదర్శకాలను రూపొందించనప్పుడు, వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలిపింది. అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలు మాత్రమేనంది. వాటిపై అభ్యంతరాలు ఉంటే ఆయా ఉద్యోగులు సవాలు చేసుకోవచ్చునంది. బదిలీల మార్గదర్శకాలను, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
వైద్య విధాన మండలిలో తప్పనిసరి బదిలీలు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన మండలి పరిధిలో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీలు ఉండనున్నాయి. ఈ విధంగా 1,023 మంది ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ జరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 83 క్యాడర్లలో 2,100 వరకు ఖాళీలు ఉన్నట్టు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఉద్యోగులు వెబ్సైట్లో లాగిన్ అయి బదిలీ దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజారోగ్య విభాగం పరిధిలోనూ ఖాళీల గుర్తింపు, ఐదేళ్లు ఒకే చోట పనిచేసి తప్పనిసరి బదిలీల్లో ఉన్న ఉద్యోగుల వివరాల ఖరారు తుది దశకు చేరుకుంది. విభాగాల వారీగా జిల్లాలు, జోన్ల పరిధిలో ఖాళీల వివరాలన్నీ వెబ్సైట్లో నమోదుపై ఉన్నతాధికారులు డీఎంహెచ్వోలు, రీజనల్ డైరెక్టర్ల నుంచి ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్నారు. -
ఇతర జిల్లాలకు బదిలీ రాజ్యాంగ ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: సొంత జిల్లాలో కాకుండా ఉద్యోగులను ఇతర జిల్లాలకు పంపడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేనందునే రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. జీవో నెం.317ను రద్దు చేసి స్థానికతకు అనుగుణంగా కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. లేఖను రాజ్‌భవన్ ఎదుట ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్సులో వేశారు. అనంతరం సీఎల్పీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ... ఆర్టికల్ 371–డి ఉల్లంఘన జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా, స్థానికత ఆధారంగా ఉద్యోగులను బదిలీలు చేయాలని కోరారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగినందునే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం, 610 జీవో డిమాండ్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు అదే స్థానికతకు భంగం వాటిల్లుతోందని చెప్పారు. ఉద్యోగులను అడ్డగోలుగా బదిలీ చేయడం ద్వారా వారు కుటుంబ సభ్యులకు దూరమయ్యేపరిస్థితి ఏర్పడుతోందన్నారు. -
పైరవీల పర్వం ప్రారంభం
సాక్షి, ఒంగోలు : ‘మనోడేనండీ.. పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఇతన్ని మాత్రం మార్చకండీ..’ ‘సార్.. మా మనిషి ఇప్పటిదాకా మారుమూల ప్రాంతాల్లో పనిచేశాడండీ.. మేం అధికారంలోకొచ్చాకైనా మంచి పోస్టింగ్ ఇప్పించుకోవాలి గదా.. అందుకని, మేం చెప్పిన ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వాలి...’ ఈవిధమైన ఫోన్లు, సిఫార్సు లేఖలతో జిల్లా ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ అంటేనే, అధికారులు ఉలిక్కిపడుతున్నారు. తమ పరిధిలో లేని అంశాలపై కూడా నేతలు ఒత్తిడి చేస్తుండటంతో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో కార్యాలయాల్లో హడావుడి మొదలైంది. ఏడాది మధ్యలో బదిలీల ఉత్తర్వులు విడుదలకావడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఉన్నచోటే పనిచేయాలనుకునే వారు ... తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని కొందరు.. ఇలా ఎవరికి వారు సొంత కసరత్తులో ఉన్నారు. అధికారపార్టీ నేతల్ని ఆశ్రయిస్తూ సిఫార్సులు చేయించుకుంటున్నారు. రంగంలోకి దిగిన దళారులు.. కోరుకున్న చోటుకు బదిలీ చేయిస్తామంటూ రాజకీయ దళారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు నుంచి వారు భారీమొత్తం డిమాండ్ చేస్తున్నారు. పోస్టింగ్‌ల కోసం కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలతో సర్వం సమాయత్తమయ్యారు. జిల్లాస్థాయి అధికారుల్లో చాలామందికి మూడేళ్ల సర్వీసు పూర్తయింది. సహజంగానే వీరందర్నీ బదిలీచేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బదిలీ ఖాయమనుకున్న వారు అనుకూలమైన జిల్లాను ఎంచుకుని, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కొందరు ఇదే జిల్లాలో వేరే పోస్టులకు మారేందుకు పావులు కదుపుతున్నారు. బదిలీల జాబితాలో హౌసింగ్ పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్వో, డీపీవో, డీఆర్డీఏ పీడీ, డీఎంహెచ్‌వో, డీఈవో, డ్వామాపీడీ, ఐసీడీఎస్ పీడీ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లాగ్రంథాలయ సంస్థ కార్యదర్శి తదితరులు ఉన్నారు. వీరంతా సచివాలయం చుట్టూ తిరగడం ఇప్పటికే ప్రారంభించారు. జిల్లాలో అర్బన్, రూరల్ కలిసున్న ప్రాంత మండల తహశీల్దార్ ఒకరు ఇప్పటికే తన పోస్టింగ్ కదలకుండా చేసుకునేందుకు స్థానిక నేతకు ముడుపులు ముట్టజెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఒక అర్డీవో జిల్లాలోనే మరో డివిజన్‌కు మార్చుకునేందుకు పక్క జిల్లా మంత్రితో పైరవీ చేయించుకుంటున్నట్లు తెలిసింది. చిరుద్యోగి పోస్టు నుంచి ఉన్నతాధికారి స్థానచలనం వరకు దళారీ డిమండ్‌ను బట్టి ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు సమర్పించుకుంటున్నట్టు సమాచారం. పోలీసుశాఖలోనూ.. త్వరలోనే డీఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐల వరకు భారీ బదిలీలు జరగునున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి బదిలీలకు సంబంధించి గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఒక ప్రత్యేక విధానాన్ని తెరమీదికి తెచ్చారు. ఉద్యోగి సర్వీసును పరిగణలోకి తీసుకుంటూనే.. అతనికొచ్చిన అవార్డులు, రివార్డులు, అవినీతి రిమార్కులు, ఉద్యోగ నిర్లక్ష్యం తదితర అంశాలపై నివేదికలు తయారుచేయించారు. వాటన్నింటినీ పరిశీలించి.. ఎవరికి ఫోకల్, నాన్‌ఫోకల్ పోస్టులివ్వాలనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసు అధికారుల్లో ఎవరికి వారు అధికారపార్టీ నేతల్ని ఆశ్రయించి ఫోన్లు చేయించడం.. సిఫార్సులేఖలు తీసుకుంటున్నట్లు చర్చసాగుతోంది. ప్రధానంగా సీఐపోస్టింగులపై భారీగా డబ్బులు చేతులుమారుతున్నట్లు ప్రచారంలో ఉంది. -
బదిలీల భయం..!
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది. అధికార పార్టీ నేతల లేఖ, ఉప ముఖ్యమంత్రి సిఫారసు.. ఉంటే తప్ప అనువైన ప్రాంతానికి స్థానచలనం దక్కదనే ఆందోళన మొదలైంది. పాత పాలకుల ప్రభావం పోయి అంతా కొత్త మార్పులు రావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఇవన్నీ రాజకీయంగా జరగబోనున్నాయనే వాదన వినిపిస్తోంది. సెప్టెంబరు 30వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో జిల్లాలోని ఉద్యోగులందరిలో బదిలీల భయం పట్టుకుంది. జీవో నంబరు 175 ప్రకారం ఒకేచోట మూడేళ్లు పూర్తి చేసుకున్నవారందరికీ స్థానచలనం తప్పని సరి. ముఖ్యంగా మినిస్టీరియల్ సిబ్బందిలో బదిలీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని శాఖల పరిధిలో దాదాపు 20 వేల మందికి స్థానచలనం లభించే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే ప్రతి బదిలీ వెనుక తప్పని సరిగా రాజకీయ ప్రభావం ఉండేవిధంగా వ్యవహారం సాగుతోంది. సిఫారసుల కోసం పడిగాపులు... తమను ఎక్కడకు బదిలీ చేస్తారో అంటూ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులకు స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేల నుంచి లేఖలు తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట పార్టీ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయిన వారి సిఫారసు లేఖలు తీసుకునేందుకు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేఖ కోసం నానా హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు సిఫారసు చేస్తే తప్ప ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫారసు లేఖలు విడుదల కాని పరిస్థితి. దీంతో ఉద్యోగులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండే నాయకుల చుట్టూ ప్రదక్షిణం మొదలైంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయకపోవడంతో బదిలీల సాధకబాధకాలను పరిశీలించకుండా రాజకీయ ఒత్తిళ్ల ప్రకారమే జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు 30 కల్లా బదిలీల ప్రక్రియ పూర్తయి అక్టోబరు ఒకటి నుంచి తిరిగి నిషేధం అమలులోకి వస్తుంది. డాక్టర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం వైద్య, విద్య, ఉన్న విద్య శాఖలు కొన్ని మార్గదర్శకాలు పంపింది. వాటి ప్రకారమే నడుచుకునే అవకాశం ఉంది. ఆయా శాఖల సిబ్బందికి మాత్రం రాజకీయ ప్రభావం తప్పే అవకాశం ఉంది. -
విద్యుత్ శాఖలో అడ్డగోలు బదిలీలు
ఒంగోలు క్రైం: జిల్లాలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు అడ్డగోలుగా సాగుతున్నాయి. ఒకపక్క బదిలీలపై నిషేధ ఉత్తర్వులున్నా..వాటిని బేఖాతరు చేస్తూ తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో యథేచ్ఛగా బదిలీలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల అనుయాయులు, పార్టీ సానుభూతిపరులు అడిగిన చోట అడిగినట్లుగా బదిలీలు చేయించేందుకు పూనుకున్నారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయంలోని ఉన్నతాధికారి సైతం అధికార పార్టీకి దాసోహమంటూ ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని సిబ్బంది అభ్యర్థనలు, పరస్పర ఆమోద బదిలీలకు తొలుత అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ రెండు నెలల క్రితం మొదలైంది. ఈ విభాగంలో సబ్స్టేషన్లలో పనిచేసే సిబ్బంది మొదలుకొని విద్యుత్ సంస్థలో ఫీల్డ్ స్టాఫ్ అందరికీ బదిలీల అవకాశం కల్పించారు. మొదట్లో ఇంజినీర్లకు బదిలీలు లేవని ప్రకటించారు. ప్రొవెన్షియల్ సిబ్బందిలో కేవలం అకౌంట్స్ విభాగంలో ఉన్న కొంతమందికి అవకాశం ఉందంటూ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ ప్రొవెన్షియల్ సిబ్బందిలోనే ఇంజినీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, యూడీసీలు, ఎల్డీసీలు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి బదిలీల అవకాశం కల్పించలేదు. అయితే ఆ తరువాత ప్రొవెన్షియల్ విభాగంలో కూడా రిక్వెస్ట్‌లు, మ్యూచ్వల్స్ అవకాశం ఇస్తున్నట్లు తిరుపతి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి సందేశం వచ్చింది. దానికి కొంత గడువు మాత్రమే విధించారు. గత నెలలోనే ఈ గడువు ముగిసింది. అయితే తిరుపతి కార్యాలయంలో మాత్రం ఈనెల 4 లోపు వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తున్నామని చెప్పుకుంటూ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఇష్టానుసారం బదిలీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని డీఈల బదిలీలు రెండుసార్లు, ఏఈల బదిలీలు రెండుసార్లు చేసుకుంటూ వచ్చారు. ఉన్నట్లుండి గత సోమవారం జిల్లాలోని ఆరుగురు ఏఈలకు స్థాన చలనం కల్పిస్తూ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర జిల్లా కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. వాస్తవానికి 4వ తేదీతోనే ఈ బదిలీల ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టారు. అయినా వారం రోజులకు కూడా బదిలీలను చేసుకుంటూ పోవడం పట్ల కిందిస్థాయి ఉద్యోగి మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకు కొంత అసంతృప్తితో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఉన్నతాధికారులపై పట్టుబట్టి బదిలీలు చేయిస్తుండడంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి: అధికార పార్టీ నాయకుల అండదండలు మెండుగా ఉన్న ఈ శాఖలోని కొందరు ఏఈలు ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి సారించారు. అవసరమైతే అధికార పార్టీ నేతలకు రూ.లక్షల కొద్దీ ముట్టజెప్పడానికి కూడా వెనుకాడలేదని సమాచారం. ప్రాధాన్యత గల స్థానాలతోపాటు ఆదాయ వనరులు మెండుగా సమకూరే స్థానాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇప్పటికే పలు దఫాలుగా బదిలీ అయిన వారు విధుల్లో చేరిపోయారు. మొదటి విడత డీఈల బదిలీల నేపథ్యంలో అధికారుల మధ్య కొంత దుమారం కూడా చెలరేగింది. అప్పట్లో కనిగిరి డీఈని ఒంగోలు డీఈటీగా బదిలీ చేస్తే ఆయన విధుల్లో చేరకుండానే సెలవుపై వెళ్లిపోయారు. అప్పట్లో ఇద్దరు ముగ్గురు డీఈలు విధుల్లో చేరనేలేదు. ఆ తరువాత రెండో దఫా కూడా డీఈలను బదిలీ చేశారు. ఆ తరువాత మొదటి విడత ఏఈలు కొంతమందికి బదిలీ అవకాశం కల్పించారు. ఆ బదిలీల్లోనూ అధికార పార్టీ మార్కు కొట్టొచ్చినట్లు కనపడింది. -
ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు తర్వాతే!
ఉద్యోగుల బదిలీలపై చంద్రబాబు యోచన అధికారులు, ఉద్యోగులు శ్రద్ధ చూపటం లేదంటూ మంత్రుల అసంతృప్తి హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తయ్యాకనే ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 16వ తేదీ తరువాత ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు, ఉద్యోగుల విభజన ప్రక్రియపై ఒక స్పష్టత వస్తుందని.. ఆ తరువాతనే ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. ‘ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి సహకరించని ఉద్యోగులను బదిలీచేసి మీకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకోండి. నెల రోజుల పాటు బదిలీలపై నిషేధం ఎత్తేస్తాం. ఈ లోగా అన్ని బదిలీలు పూర్తిచేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు సూచించారు. ఆ మేరకు ఉత్తర్వులు వెలువడతాయని మంత్రులు ఎదురుచూసినా ఇప్పటివరకు వాటి జాడలేదు. దీంతో అసలు బదిలీలు ఎప్పటి నుంచి మొదలవుతాయన్న అంశంపై మంత్రుల్లోనే తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేబినెట్ ఆమోదించాక కూడా జీఓ ఎందుకు రాలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావును అడిగారు. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని, ఆ తరువాత ఉద్యోగుల విభజన ప్రక్రియపై కూడా కదలిక ఉంటుంది కనుక ఆ తరువాత ఉద్యోగుల బదిలీలను చేపడితే బాగుంటుందని సీఎం అబిప్రాయపడినట్లు తెలిసింది.అయితే.. అధికారులు, ఉద్యోగుల పనితీరు సరిగా లేదని, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో శ్రద్ధచూపడం లేదని మంత్రులు తాజా కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రెవెన్యూ, దేవాదాయ శాఖల ఉద్యోగులపై విజిలెన్స్ నివేదికలు మరోవైపు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బాబు మంత్రులకు ఇదివరకే సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుగుణంగా ఉన్న మంచివారిని ఎంపికచేయాలని నిర్దేశించారు. అయితే గత ప్రభుత్వంలో కొన్ని శాఖల్లో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, వారిపై విజిలెన్సు విచారణ జరపడం మంచిదని కొందరు మంత్రులు సీఎృ దష్టికి తెచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ తదితర శాఖలకు సంబంధించి ఇపుడున్న ఉద్యోగుల్లో ఎవరేమిటన్నది తేల్చాలంటే విజిలెన్స్ ద్వారా నివేదికలు రూపొందించాలని నిర్ణయించారు. ఆ పనిని విజిలెన్స్ విభాగానికి అప్పగించినట్లు సమాచారం. -
బదిలీలుంటే చేసుకోండి
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రాకముందే ఉద్యోగుల బదిలీలు ఎవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించించింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల సంఘం చేసిన సూచన విషయం తె లుసుకున్న అధికారులు బదిలీల కోసం ఫైరవీలు మొదలుపెట్టారు. తాము కోరుకున్న స్థానాలకు పంపేలా సంబంధిత మంత్రులు, శాఖల అధిపతులకు అర్జీలు పెట్టుకుంటున్నారు. కీలక బదిలీలపై చవాన్ దృష్టి... కీలకమైన శాఖల్లో అధికారుల బదిలీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్వయంగా దృష్టి సారించారు. బదిలీలకు సంబంధించిన ప్రతీ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు పంపిస్తున్నారు. దీంతో తమకు నచ్చిన చోటకు బదిలీ చేయాలని పైరవీలు చేసుకున్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు కలవరం మొదలైంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు తమకు ఫలానా శాఖకు, ఫలాన చోటుకు బదిలీ చేయాలని కోరుతూ మంత్రులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ముఖ్యమంత్రి తీరుతో జాగ్రత్తపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బదిలీ ప్రక్రియ జూన్ ఆఖరు వరకు పూర్తి చేయాలి. ఆ తరువాత జరిగే బదిలీల ప్రక్రియ ప్రత్యేక అంశంగా పరిగణించి చేస్తారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయనే ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు విధించారు. పోలీసు, రవాణ, రెవెన్యూ, నగరాభివృద్థి, ప్రజాపనులు తదితర కీలకమైన శాఖలకు బదిలీ కావాలంటే అధికారులు భారీగానే అవినీతికి పాల్పడతారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలకమైన శాఖల బదిలీలపై చవాన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఎలాంటి సిఫార్సులకు తావీయకుండా ఎవరిని, ఏ శాఖకు బదిలీ చేయాలనే విషయంలో చవాన్ స్వయంగా తుది నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. వారంరోజుల కిందట పోలీసు శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రకియకు ముందు ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రతి అధికారి ఫైలును చవాన్ స్వయంగా పరిశీలించారు. నియమాలకు లోబడి ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేశారు. రవాణ, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖల బదిలీలను కూడా చవాన్ ఇదే పద్ధతిలో చేపట్టారు. కొందరు అధికారులు మంత్రుల అండచూసుకొని తమ తమ బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారి ఆటలు సాగలేకపోయాయి. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో చవాన్ అదే పద్ధతిలో ముందుకు సాగుతారని చెబుతున్నారు. దీంతో బదిలీలపై ఆశలు పెట్టుకున్న అధికారులకు చివరకు నిరాశే మిగిలే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.