రాజ్‌భవన్ వద్దనున్న గ్రీవెన్స్ బాక్స్‌లో లేఖను వేస్తున్న జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సొంత జిల్లాలో కాకుండా ఉద్యోగులను ఇతర జిల్లాలకు పంపడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేనందునే రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. జీవో నెం.317ను రద్దు చేసి స్థానికతకు అనుగుణంగా కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు.
లేఖను రాజ్‌భవన్ ఎదుట ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్సులో వేశారు. అనంతరం సీఎల్పీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ... ఆర్టికల్ 371–డి ఉల్లంఘన జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా, స్థానికత ఆధారంగా ఉద్యోగులను బదిలీలు చేయాలని కోరారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగినందునే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం, 610 జీవో డిమాండ్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు అదే స్థానికతకు భంగం వాటిల్లుతోందని చెప్పారు. ఉద్యోగులను అడ్డగోలుగా బదిలీ చేయడం ద్వారా వారు కుటుంబ సభ్యులకు దూరమయ్యేపరిస్థితి ఏర్పడుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment