ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు తర్వాతే!
ఉద్యోగుల బదిలీలపై చంద్రబాబు యోచన
అధికారులు, ఉద్యోగులు శ్రద్ధ చూపటం లేదంటూ మంత్రుల అసంతృప్తి
హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తయ్యాకనే ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 16వ తేదీ తరువాత ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు, ఉద్యోగుల విభజన ప్రక్రియపై ఒక స్పష్టత వస్తుందని.. ఆ తరువాతనే ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. ‘ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి సహకరించని ఉద్యోగులను బదిలీచేసి మీకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకోండి. నెల రోజుల పాటు బదిలీలపై నిషేధం ఎత్తేస్తాం. ఈ లోగా అన్ని బదిలీలు పూర్తిచేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు సూచించారు. ఆ మేరకు ఉత్తర్వులు వెలువడతాయని మంత్రులు ఎదురుచూసినా ఇప్పటివరకు వాటి జాడలేదు.
దీంతో అసలు బదిలీలు ఎప్పటి నుంచి మొదలవుతాయన్న అంశంపై మంత్రుల్లోనే తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేబినెట్ ఆమోదించాక కూడా జీఓ ఎందుకు రాలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావును అడిగారు. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని, ఆ తరువాత ఉద్యోగుల విభజన ప్రక్రియపై కూడా కదలిక ఉంటుంది కనుక ఆ తరువాత ఉద్యోగుల బదిలీలను చేపడితే బాగుంటుందని సీఎం అబిప్రాయపడినట్లు తెలిసింది.అయితే.. అధికారులు, ఉద్యోగుల పనితీరు సరిగా లేదని, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో శ్రద్ధచూపడం లేదని మంత్రులు తాజా కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తంచేశారు.
రెవెన్యూ, దేవాదాయ శాఖల ఉద్యోగులపై విజిలెన్స్ నివేదికలు
మరోవైపు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బాబు మంత్రులకు ఇదివరకే సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుగుణంగా ఉన్న మంచివారిని ఎంపికచేయాలని నిర్దేశించారు. అయితే గత ప్రభుత్వంలో కొన్ని శాఖల్లో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, వారిపై విజిలెన్సు విచారణ జరపడం మంచిదని కొందరు మంత్రులు సీఎృ దష్టికి తెచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ తదితర శాఖలకు సంబంధించి ఇపుడున్న ఉద్యోగుల్లో ఎవరేమిటన్నది తేల్చాలంటే విజిలెన్స్ ద్వారా నివేదికలు రూపొందించాలని నిర్ణయించారు. ఆ పనిని విజిలెన్స్ విభాగానికి అప్పగించినట్లు సమాచారం.