సాక్షి, ఒంగోలు : ‘మనోడేనండీ.. పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఇతన్ని మాత్రం మార్చకండీ..’ ‘సార్.. మా మనిషి ఇప్పటిదాకా మారుమూల ప్రాంతాల్లో పనిచేశాడండీ.. మేం అధికారంలోకొచ్చాకైనా మంచి పోస్టింగ్ ఇప్పించుకోవాలి గదా.. అందుకని, మేం చెప్పిన ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వాలి...’ ఈవిధమైన ఫోన్‌లు, సిఫార్సు లేఖలతో జిల్లా ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ అంటేనే, అధికారులు ఉలిక్కిపడుతున్నారు.
తమ పరిధిలో లేని అంశాలపై కూడా నేతలు ఒత్తిడి చేస్తుండటంతో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో కార్యాలయాల్లో హడావుడి మొదలైంది. ఏడాది మధ్యలో బదిలీల ఉత్తర్వులు విడుదలకావడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఉన్నచోటే పనిచేయాలనుకునే వారు ... తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని కొందరు.. ఇలా ఎవరికి వారు సొంత కసరత్తులో ఉన్నారు. అధికారపార్టీ నేతల్ని ఆశ్రయిస్తూ సిఫార్సులు చేయించుకుంటున్నారు.
రంగంలోకి దిగిన దళారులు..
కోరుకున్న చోటుకు బదిలీ చేయిస్తామంటూ రాజకీయ దళారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు నుంచి వారు భారీమొత్తం డిమాండ్ చేస్తున్నారు. పోస్టింగ్‌ల కోసం కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలతో సర్వం సమాయత్తమయ్యారు. జిల్లాస్థాయి అధికారుల్లో చాలామందికి మూడేళ్ల సర్వీసు పూర్తయింది. సహజంగానే వీరందర్నీ బదిలీచేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బదిలీ ఖాయమనుకున్న వారు అనుకూలమైన జిల్లాను ఎంచుకుని, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
కొందరు ఇదే జిల్లాలో వేరే పోస్టులకు మారేందుకు పావులు కదుపుతున్నారు. బదిలీల జాబితాలో హౌసింగ్ పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్‌వో, డీపీవో, డీఆర్‌డీఏ పీడీ, డీఎంహెచ్‌వో, డీఈవో, డ్వామాపీడీ, ఐసీడీఎస్ పీడీ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లాగ్రంథాలయ సంస్థ కార్యదర్శి తదితరులు ఉన్నారు. వీరంతా సచివాలయం చుట్టూ తిరగడం ఇప్పటికే ప్రారంభించారు.
జిల్లాలో అర్బన్, రూరల్ కలిసున్న ప్రాంత మండల తహశీల్దార్ ఒకరు ఇప్పటికే తన పోస్టింగ్ కదలకుండా చేసుకునేందుకు స్థానిక నేతకు ముడుపులు ముట్టజెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఒక అర్డీవో జిల్లాలోనే మరో డివిజన్‌కు మార్చుకునేందుకు పక్క జిల్లా మంత్రితో పైరవీ చేయించుకుంటున్నట్లు తెలిసింది. చిరుద్యోగి పోస్టు నుంచి ఉన్నతాధికారి స్థానచలనం వరకు దళారీ డిమండ్‌ను బట్టి ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు సమర్పించుకుంటున్నట్టు సమాచారం.
పోలీసుశాఖలోనూ..
త్వరలోనే డీఎస్పీ స్థాయి నుంచి ఎస్‌ఐల వరకు భారీ బదిలీలు జరగునున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి బదిలీలకు సంబంధించి గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఒక ప్రత్యేక విధానాన్ని తెరమీదికి తెచ్చారు. ఉద్యోగి సర్వీసును పరిగణలోకి తీసుకుంటూనే.. అతనికొచ్చిన అవార్డులు, రివార్డులు, అవినీతి రిమార్కులు, ఉద్యోగ నిర్లక్ష్యం తదితర అంశాలపై నివేదికలు తయారుచేయించారు. వాటన్నింటినీ పరిశీలించి.. ఎవరికి ఫోకల్, నాన్‌ఫోకల్ పోస్టులివ్వాలనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసు అధికారుల్లో ఎవరికి వారు అధికారపార్టీ నేతల్ని ఆశ్రయించి ఫోన్‌లు చేయించడం.. సిఫార్సులేఖలు తీసుకుంటున్నట్లు చర్చసాగుతోంది. ప్రధానంగా సీఐపోస్టింగులపై భారీగా డబ్బులు చేతులుమారుతున్నట్లు ప్రచారంలో ఉంది.
పైరవీల పర్వం ప్రారంభం
Published Wed, Sep 24 2014 2:47 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement