సాక్షి, ముంబై: ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రాకముందే ఉద్యోగుల బదిలీలు ఎవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించించింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల సంఘం చేసిన సూచన విషయం తె లుసుకున్న అధికారులు బదిలీల కోసం ఫైరవీలు మొదలుపెట్టారు. తాము కోరుకున్న స్థానాలకు పంపేలా సంబంధిత మంత్రులు, శాఖల అధిపతులకు అర్జీలు పెట్టుకుంటున్నారు.
కీలక బదిలీలపై చవాన్ దృష్టి...
కీలకమైన శాఖల్లో అధికారుల బదిలీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్వయంగా దృష్టి సారించారు. బదిలీలకు సంబంధించిన ప్రతీ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు పంపిస్తున్నారు. దీంతో తమకు నచ్చిన చోటకు బదిలీ చేయాలని పైరవీలు చేసుకున్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు కలవరం మొదలైంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు తమకు ఫలానా శాఖకు, ఫలాన చోటుకు బదిలీ చేయాలని కోరుతూ మంత్రులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ముఖ్యమంత్రి తీరుతో జాగ్రత్తపడుతున్నారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బదిలీ ప్రక్రియ జూన్ ఆఖరు వరకు పూర్తి చేయాలి. ఆ తరువాత జరిగే బదిలీల ప్రక్రియ ప్రత్యేక అంశంగా పరిగణించి చేస్తారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయనే ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు విధించారు. పోలీసు, రవాణ, రెవెన్యూ, నగరాభివృద్థి, ప్రజాపనులు తదితర కీలకమైన శాఖలకు బదిలీ కావాలంటే అధికారులు భారీగానే అవినీతికి పాల్పడతారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలకమైన శాఖల బదిలీలపై చవాన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఎలాంటి సిఫార్సులకు తావీయకుండా ఎవరిని, ఏ శాఖకు బదిలీ చేయాలనే విషయంలో చవాన్ స్వయంగా తుది నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. వారంరోజుల కిందట పోలీసు శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రకియకు ముందు ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంలో ప్రతి అధికారి ఫైలును చవాన్ స్వయంగా పరిశీలించారు. నియమాలకు లోబడి ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేశారు. రవాణ, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖల బదిలీలను కూడా చవాన్ ఇదే పద్ధతిలో చేపట్టారు. కొందరు అధికారులు మంత్రుల అండచూసుకొని తమ తమ బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారి ఆటలు సాగలేకపోయాయి. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో చవాన్ అదే పద్ధతిలో ముందుకు సాగుతారని చెబుతున్నారు. దీంతో బదిలీలపై ఆశలు పెట్టుకున్న అధికారులకు చివరకు నిరాశే మిగిలే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
బదిలీలుంటే చేసుకోండి
Published Wed, Aug 6 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement