సాక్షి, ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనులకు హాజరైన మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బంది ఇప్పట్లో విధుల్లోకి చేరే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల తరువాతే వీరంతా తమతమ కుర్చీల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం బీఎంసీ కార్యాలయాలకు వచ్చే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సకాలంలో పనులు జరకపోవడంతో పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల పనులకు వెళ్లిన అనేక మంది సిబ్బందిని ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి బీఎంసీకి పంపించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులంతా ఇప్పటికీ కమిషన్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వేలాది మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుంది.
బీఎంసీ నుంచి అధికారులు, గుమాస్తాలు, అకౌంటెంట్ల వంటి అనేక మంది ఉద్యోగులు ఎన్నికల పనులకు వెళ్లారు. ఇందులో కొందరిని తిరిగి పంపించిన్పటికీ గణేశ్ ఉత్సవాల సమయం కావడంతో అనేక మంది స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో బీఎంసీ కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వీరంతా తిరిగి వచ్చే సరికి అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులంతా తిరిగి ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సిందే.
బీఎంసీ కార్యాలయాల్లో పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళితే వారిని సాధారణ రోజుల్లోనే చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని ముంబైకర్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగులు పూర్తి సంఖ్యలో లేకపోవడంతో పనులను మరింత ఆలస్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ తిప్పలు అసెంబ్లీ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పకపోవచ్చని ముంబై సెంట్రల్‌వాసి ఒకరు అన్నారు.
బీఎంసీ వర్సెస్ ఉత్సవ మండళ్లు ముదురుతున్న గుంతల వివాదం
గత ఏడాది తవ్విన గుంతలను పూడ్చివేయాలంటూ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) జారీ చేసిన నోటీసులను అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతోంది. తొలుత రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, ఆ తరువాతే మండళ్ల నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్వాహకులు బీఎంసీని డిమాండ్ చేస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మండపాలు ఏర్పాటు చేసేందుకు సార్వజనిక మండళ్ల ప్రతినిధులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంతలు తవ్వించారు. చవితి వేడుకలు ముగిసిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేశారు. గుంతలను ఇంతవరకు పూడ్చలేదు కాబట్టి నిమజ్జనం పూర్తయ్యేంతలోపు జరిమానా చెల్లించాలని మండళ్లకు బీఎంసీ నోటీసులు జారీచేసింది. ఇలా జరిమానా వసూలు చేయడం సరైన పద్ధతి కాదని, తాము ఒక్క పైసా కూడా చెల్లించబోమని మండళ్లు తెగేసి చెప్పాయి. మండళ్లు గుంతలు తవ్వినందుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జరిమానా చెల్లించాలని బీఎంసీ ఆదేశించింది.
రోడ్లపై ఏర్పడిన గుంతలతో పోలిస్తే తాము తవ్విన గుంతలు చాలా చిన్నవని, ఉత్సవాలు పూర్తికాగానే సిమెంట్‌తో పూడ్చివేశామని మండళ్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. బీఎంసీ మాత్రం గుంతలకు జరిమానా చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది. లేకుంటే ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని మొదట హెచ్చరించింది. తదనంతరం ఈ నిబంధనను ఉపసంహరించుకుని నిమజ్జనం ముగిసేలోపు జరిమానా చెల్లించాలని సూచించింది.
జరిమానా చెల్లించేందుకు మండళ్లు నిరాకరిస్తున్నాయి.
చిన్న గుంతలకే వేలల్లో జరిమానా విధిస్తామంటే.. నగర రహదారులపై ఉన్న పెద్ద పెద్ద గుంతల సంగతేమిటని ప్రశ్నిస్తున్నాయి. జరిమానా వివాదంపై బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి సభ్యులపై చర్చిస్తామని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో ఈ విషయం చర్చించామని, జరిమానా చెల్లించనవసరం లేదని ఆయన తమకు హామీ ఇచ్చారని సమితి సభ్యుడు గిరీశ్ బాలావల్కర్ అన్నారు. నిమజ్జనాలకు ముందే జరిమానా చెల్లించాల్సిందేనని బీఎంసీ పట్టుబట్టడంతో ఈ వివాదం ముదురుతోంది.
సిబ్బంది లేక ఇబ్బందులు
Published Fri, Sep 5 2014 10:26 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM
Advertisement
Advertisement