తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నా.. జూనియర్లకు స్థానచలనం కష్టమే..
బదిలీ నిబంధనలు సవరించాలంటున్న ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ప్రభుత్వ శాఖలు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల వారీగా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీచేసే పనిలో బిజీ అయ్యాయి. వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు 2018లో జరిగాయి. ఆ తర్వాత జీఓ 317 కింద జరిగిన కేటాయింపులు, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలు మినహా ఉద్యోగులకు స్థానచలనం కలగలేదు. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. 40 శాతం మించి ఉద్యోగులకు బదిలీలు చేయొద్దని స్పష్టం చేయడంతో, సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న వారికి తాజా బదిలీలు నిరాశ కలిగిస్తాయనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.
సీనియర్లకే అవకాశం...
ఒక ఉద్యోగి ఒకస్థానంలో గరిష్టంగా నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో వరు సగా నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తే వారు తప్పకుండా బదిలీ కావాల్సి ఉంటుంది. 40 శాతం మించొద్దని చెప్పడంతో తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న చాలామంది ఉద్యోగులకు స్థానచలనం కష్టమని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి, మలీ్టజోనల్, జోనల్, జిల్లా కేడర్‌లో బదిలీలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేడర్ యూనిట్ ప్రకారం బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాను సంబంధిత శాఖలు ప్రకటిస్తాయి.
40 శాతం మాత్రమే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం జిల్లా కేడర్‌లో 10 మంది ఉద్యోగులు ఉంటే అందులో కేవలం నలుగురు మాత్రమే బదిలీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగి దాదాపు ఆరేళ్లు కావొస్తుంది. దీంతో నాలుగేళ్లు సర్వీసు దాటిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తే పనిచేస్తున్న వారిలో మెజారిటీ శాతం తప్పనిసరి బదిలీ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ 40శాతం మందికి అవకాశం కల్పిస్తే కేవలం కొందరు సీనియర్లకు మాత్రమే స్థానచలనం కలుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు ఆర్టర్ టు సర్వ్ ప్రాతిపదికన పలు జిల్లా కార్యాలయాల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సాధారణ బదిలీల కోసం వారంతా ఎదురు చూస్తుండగా... ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరిలో మెజారిటీ ఉద్యోగులకు తాజా బదిలీల్లో అవకాశం కలగుతుందా? లేదా? వేచి చూడాలి. అయితే 40శాతం నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ కూడా ఉద్యోగవర్గాల నుంచి వినిపిస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా, తప్పనిసరి బదిలీల జాబితా వెలువడేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఈలోపు ఎంతమందికి బదిలీల్లో అవకాశం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment