సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఒకేచోట మూడేళ్లు సర్వీసు దాటిన అధికారుల బదిలీకి జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీనాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ, సాధ్యమైనంత త్వరగా ఈ తతంగానికి ముగింపు పలకాలని నిర్ణయించింది. బదిలీలపై అంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ప్రక్రియను చకచకా పూర్తి చే సేందుకు సన్నాహాలు చేస్తోంది. గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లు ఒకేచోట పనిచేసిన అధికారులకు స్థాన చలనం కలిగించాలని ఈసీ నిర్దేశించింది.
సొంత జిల్లాలో పనిచేస్తున్నా, క్రిమినల్, ఇతర కేసులు నమోదైన అధికారులను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో మెజార్టీ తహసీల్దార్లపై బదిలీ వేటు పడుతోంది. మరోవైపు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో)ను కూడా బదిలీల జాబితాలో చేరుస్తూ ఈసారి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్ష సంబంధంలేదని తమను బదిలీల నుంచి మినహాయించాలని ఈసీని వేడుకునప్పటికీ ఫలితం లేకపోవడ ంతో దీర్ఘకాలికంగా జిల్లాలో తిష్టవేసిన ఎంపీడీవోలు అన్యమనస్కంగా కుర్చీని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, బదిలీలు అనివార్యం కావడంతో పొరుగు జిల్లాల్లో అనువైన పోస్టింగ్‌ల అన్వేషణలో మునిగిపోయారు. ఎన్నికల తంతు ముగిసిన తర్వాత ఎలాగూ వెనక్కి వస్తామని భావిస్తున్నప్పటికీ, రాష్ట్ర విభజన ప్రక్రియ ఎక్కడ తమ బదిలీలపై ప్రభావం చూపుతుందోననే బెంగ వారిని వెంటాడుతోంది. విభ జన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఆర్నెళ్ల వరకు వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరుగుతుండడం వీరిని కలవరపరుస్తోంది. ఇదే జరిగితే ఏడాదివరకు మళ్లీ జిల్లాకు వచ్చే వీలుండదనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. కాగా, తొలిసారి ఎస్‌ఐలకు కూడా బదిలీలను వర్తింపజేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందే తడువు.. గ్రామీణ ఎస్పీ పరిధిలో భారీగా ఎస్‌ఐలకు పోలీసుశాఖ స్థానచలనం కలిగించింది.
21 మంది తహసీల్దార్లు కూడా...
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 21 మంది తహసీల్దార్లకు స్థానభ్రంశం కలుగనుంది. వీరితోపాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధమైంది. బదిలీ జాబితాలో ఉన్న అధికారుల ది సొంత జిల్లా ఇదే కావడం గమనార్హం. ఇదిలావుండగా... సాధారణ బదిలీలపై ఆంక్షలు సడలించడంతో ఇదే అదనుగా ఇతర మండలాల తహసీల్దార్లను కదిలించేందుకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ విభాగం సీసీఎల్‌ఏ) ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ మేరకు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల జాబితాను పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పైరవీలతో జిల్లాలో పోస్టింగ్ చేపట్టిన తహసీల్దార్లకు చెక్ పెట్టేందుకు ఈసీ మార్గదర్శకాలను అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఈసీ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ల బదిలీలు జరిగే మండలాలివే...
ఉప్పల్, మేడ్చల్, బషీరాబాద్, ఘట్‌కేసర్, పెద్దెముల్, మొయినాబాద్, కీసర, మల్కాజ్‌గిరి, శంకర్‌పల్లి, చేవెళ్ల, శామీర్‌పేట, మహేశ్వరం, షాబాద్, యాచారం, శంషాబాద్, పరిగి, కుల్కచర్ల, గండీడ్, ధారూర్, తాండూరు, యాలాల.
మరోవైపు బదిలీల వ్యవహారాన్ని ఫిబ్రవరి ఐదో తేదీలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ శ్రీధర్ సీసీఎల్‌ఏకు నివేదించారు. పదో తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు ఉన్నందున ఈ మేరకు ప్రక్రియను త్వరగా ముగించేలా చూడాలని కోరారు.
బదిలీల కాక!
Published Tue, Jan 28 2014 11:35 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement