సాక్షి, చిత్తూరు: ఎన్నికల వేళ అధికారులపై బదిలీవేటు పడనుంది. ఒకే డివిజన్‌లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. బదిలీలు తప్పనిసరి అయినప్పటికీ అధికారుల్లో భయం మొదలయ్యింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు ప్రాథమికంగా జిల్లాలో తెరలేచింది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరి లోపు రావచ్చని రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వివిధ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న అధికారులు, సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారుల వివరాలను పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి సేకరించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ దిశగా జిల్లా అధికారులకు సూచనలు వచ్చాయి.
తొలుత రిటర్నింగ్ అధికారుల స్థాయిలో (డెప్యూటీ కలెక్టర్లుగా) ఉన్నవారు సొంత జిల్లాల్లో పనిచేస్తున్నది ఎంతమంది అనేది ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. 14 నియోజకవర్గాలకు 14 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అవసరం కాగా, వీరిలో నలుగురు, ఐదుగురు సొంత జిల్లాలోనే విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం పంపారు. ఇదిలావుండగా జిల్లాలో 20 మంది వరకు డెప్యూటీ కలెక్టర్లుగా
వివిధ పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పోలీసు శాఖ నుంచి వివరాల సేకరణ
తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు పోలీసు జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఒకే డివిజన్‌లో ఐదేళ్లకు మించి పనిచేస్తున్నవారు, జిల్లాలో మూడేళ్లు దాటిన అధికారుల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ సేకరించింది. ఎస్పీల నుంచి ఎన్నికల కమిషన్ ఈ వివరాలు తీసుకుంటోంది. ఇప్పటికే తిరుపతి అర్బన్, చిత్తూరు సర్కిల్ పరిధిలో మూడేళ్లు పూర్తిచేసిన సీఐలు 10 మంది బదిలీ అయ్యారు. వీరుకాకుండా మరో 20 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఈ బదిలీలు పూర్తి చేయాలని కమిషన్ కసరత్తు చేస్తోంది.
జిల్లా తహశీల్దార్లు ఇతర జిల్లాలకు
చిత్తూరు జిల్లాలోని 66 మండల తహశీల్దార్లు, ఇతర పోస్టుల్లోని తహశీల్దార్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ వివరాలు అడగకపోయినా, ఇప్పటికే జిల్లాలో మూడేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసినవారు, సొంత జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందినవారి వివరాలను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. మన జిల్లాలోని తహశీల్దార్లు అందరూ అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాలకు వెళ్లనున్నారు. అక్కడి వారు ఈ జిల్లాకు బదిలీ కానున్నారు.
డెప్యూటీ కలెక్టర్ల వివరాలు పంపాం
ఎన్నికల కమిషన్‌కు ప్రస్తుతం రిటర్నింగ్ అధికారుల (డెప్యూటీ కలెక్టర్ల) వివరాలు పంపాం. నలుగురు, ఐదుగురు సొంత జిల్లాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. తహశీల్దార్ల వివరాలు సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్ అడిగితే పంపుతాం. -ఒంగోలుశేషయ్య, జిల్లా రెవెన్యూ అధికారి, చిత్తూరు
బదిలీల భయం
Published Fri, Jan 17 2014 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement