రంగారెడ్డి: కొనుగోలు ముసుగులో స్పోర్ట్స్ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి తన లంబోర్ఘిని కారు (డిఎల్ 09 సివి 3636) అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్‌కు చెప్పాడు. దీంతో కస్టమర్ ఉంటే చూడాలంటూ అయాన్ తన స్నేహితుడైన మొఘల్‌పురాకు చెందిన అమన్ హైదర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు.
శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్ చెప్పడంతో, అయాన్ కారు తీసుకొచ్చి జల్‌పల్లి వద్ద అమన్‌కు ఇచ్చాడు. జల్‌పల్లి నుంచి అమన్ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్‌పోర్ట్ రోడ్డు వైపు మళ్లి కారును ఆపారు. అనంతరం అహ్మద్, అతనితో పాటు మరికొంత మంది హోండా సిటీ, వ్యాగనార్ కార్లు, బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. నీరజ్ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్, అతని వెంట వచ్చిన వారు బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒక్కసారిగా లంబోర్గిని కారుపై పోసి నిప్పంటించారు. ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్సై మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment