సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లో యువతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. బాకరం గ్రామ పరిధిలో సోమవారం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్‌గా (22) గుర్తించారు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. జనవరి 8వ తేదీని ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానంత తానుగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతురాలు చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవపడి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్‌లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపే అవకాశం ఉంది.
వెలుగులోకి కొత్త విషయాలు
పోలీసుల విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన తరువాత సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులకు.. ఒక ఆటో అక్కడి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో పోలీసులు ఆటో నడిపిన వ్యక్తిని గుర్తించి విచారించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపమని యువతి కోరిందని.. తాను అలాగే అక్కడ దించేసి వెళ్లినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తరువాత ఎం జరిగిందో తెలియదని అన్నాడు.
అయితే యువతి ఆత్మహత్యకు ఒక రోజు ముందే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్‌తోపాటు చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులతో కలిసి లో బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించాయి.
పోలీసుల నిర్లక్ష్యం.. సీపీ ఆగ్రహం
ఈ కేసులో హబీబ్ నగర్‌లో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్ కనిపించకుండా పోగా.. పదో తేదీనా యువతి సోదరుడు హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో హైదరాబాద్ సీపీ స్వయంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హబీబ్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పారు.
హబీబ్ నగర్ ఎస్సై సస్పెండ్
మొయినాబాద్ యువతి మృతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీరియస్ అయ్యారు. ఘటనలో మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ రాంబాబుకు మోమో జారీ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment