శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వం నిర్వహించే బదిలీ ల్లో సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై దీని ప్రభావం పడుతుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వారు వివరించారు. అలాగే గ్రేడ్-1 వసతి గృహం అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.
వినతిపత్రం అందించిన వారిలో ఎస్ ఆనందరావు, కే వెంకట్రావు, గురువి నాయుడు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఈ గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మాద్ హసన్ షరీఫ్, జిల్లా రెవెన్యూ ఆధికారి నూరు భాషా కాశీం తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా...
* ఎచ్చెర్ల మండలం కొంగరాం వద్దగల స్మార్టుకాం(వీబీసీ)కర్మాగారం వ్యర్థాలను పొలాల్లోకి విడిచిపెడుతోందని, దీంతో తాగు, సాగునీరు కలుషితం అవుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు.
వెంటనే పరిశ్రమను నిలిపివేయాలని కొంగరాం, ఏజీఎన్‌పేట గ్రామాలకు చెందిన అనపాల అప్పలస్వామి, డీ సన్యాసిరావు, సీహెచ్ గురువులు, గురివినాయుడు, సీతారాములు, లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు.
* వజ్రపు కొత్తురు మండలం నగరం పల్లి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులు రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లు తొలగించారని, రీసర్వే చేయాలని ఆ గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, వీ జయరాం చౌదరి, బమ్మిడి మోహనరావు, సనపల భాస్కరరావు, నందికేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
* వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరిలో ఫ్యామిలీ కౌన్సిలర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని, అయితే ఇంతరవరకూ పోస్టింగు ఇవ్వలేదని ఎంపికైన అభ్యర్థి విజయలత తదితరులు ఫిర్యాదు చేశారు.
* మెలియాపుట్టి మండలం చాపరలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులపై ఆ పాఠశాల హెచ్‌ఎం దొంగతనం అంటగట్టి విధుల నుంచి తొలగించారని ఫిర్యాదు అందింది. న్యాయం చేయాలని బాధితులు వరలక్ష్మి, దమయంతి, లక్ష్మి, సుందరమ్మ తదితరులు కోరారు. ఇంకా లావేరు మండలం గుర్రాల పాలెం గ్రామస్తులు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని, శ్రీకాకుళం మండలం నైర గ్రామానికి చెందిన అరటి, జీడిమామిడి తోటల రైతులు తుపాను సాయం అందించాలని గ్రీవెన్స్‌లో విజ్ఞఫ్తి చేశారు.
బదిలీలు నిలుపుదల చేయాలి
Published Tue, Nov 11 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement