Hostel welfare officers
-
‘సంక్షేమ’ కొలువుల్లో డీఈడీలు గల్లంతు!.. మార్పులపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: వసతిగృహ సంక్షేమాధికారి (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) కొలువుల భర్తీ ప్రక్రియ డీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లతోపాటు ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కూడా పోస్టులు భర్తీ చేస్తున్న ప్రభుత్వం.... విద్యార్హతలను డిగ్రీ–డీఈడీ స్థాయికి పెంచిన అంశాన్ని ప్రకటించకపోవడంపట్ల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు మొదలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ చేపట్టిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో డీఈడీ లేదా బీఈడీలకు అవకాశం కల్పించింది. తాజాగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హతల మార్పు చేపట్టడంతో డీఈడీ చేసిన లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పది కేటగిరీల్లో 581 పోస్టులు... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొలువుల జాతరలో భాగంగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటగిరీల వారీగా సంబంధిత నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23న గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2, హాస్టల్ వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2 కేటగిరీల్లో 581 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో 544 పోస్టులున్నాయి. పోస్టులపరంగా ఈ సంఖ్య చాలా పెద్దది కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. తీరా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యాక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న డీఈడీ అభ్యర్థులు తెల్లముఖం వేశారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 కేటగిరీల్లోని 549 పోస్టులకు కేవలం డిగ్రీ బీఈడీ అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మరో రెండు కేటగిరీల్లోని 10 గ్రేడ్–1 పోస్టులకు డిగ్రీ–బీఈడీ తప్పనిసరి. కేవలం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 8 కొలువులకే డీఈడీ అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామంటూ డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అర్హతల్లో మార్పులు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పుస్తకం.. ఓ బహుమానం -
310 హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్–1, గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్–1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–4, గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను www.tspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆందోళన
అనంతపురం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ సంక్షేమ హాస్టళ్ల అధికారులు డిమాండ్ చేశారు. ఏపీ సంక్షేమ హాస్టళ్ల అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.శ్రీరాములు మాట్లాడుతూ.... సంక్షేమ హాస్టళ్ల అధికారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పదోన్నతుల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని.... 30 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతి కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు మాదిరిగా హాస్టళ్ల అధికారులకు 30 రోజులు ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగా ఎనిమిది గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రీమెట్రిక్ అంటూ అదనపు సమయం పనిచేయిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌లోని సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్కి నాయకులు వినతిపత్రం అందజేశారు. -
ఇంకోసారి మూడిందే..
నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్‌డబ్ల్యూఓలకు కలెక్టర్ హెచ్చరిక ఒక్కో అధికారి రెండు హాస్టళ్లు దత్తత తీసుకోవాలని కరుణ సూచన హన్మకొండ అర్బన్/నక్కలగుట్ట : జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని కల్టెకర్ కరుణ హెచ్చరించారు. అధికారులు ఇప్పటికే రెండు రోజులుగా హాస్టళలో తనిఖీలు చేపట్టారని, మరోసారి తనిఖీలుంటాయని, మార్పు రాకుంటే హెచ్డబ్ల్యూఓలను సస్పెండ్ చేయాలని ఆయూ సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లను ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో అధికారులు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టరేట్లో సంబంధిత తనిఖీ అధికారులతో బుధ వారం కలెక్టర్ సమీక్షించారు. 72 అంశాలపై వివరాలు సమర్పించాలని వారికి తనిఖీ రిపోర్టు నమూనా అందజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్లు, సిబ్బందిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో తనిఖీల్లో తేలిన అంశాలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనం తరం కరుణ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో అధికారి రెండు హాస్టళ్ల చొప్పున దత్తత తీసుకోవాలని, ప్రతి వారంలో రెండు సార్లు ఆ హాస్టళ్లను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, కొందరు హెచ్‌డబ్ల్యూఓలు హాస్టళ్లలో అందుబాటులో లేకపోవడం, మరికొం దరు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తుండడం, రిజిస్టర్లు, విద్యార్థుల సంఖ్య భారీగా తేడా ఉండడం వంటి అంశాలను కరుణ సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. ఇందులోభాగంగానే ముందస్తుగా సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమా చారం. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ శ్రుతి ఓజా, సంక్షేమ శౠకళ డిప్యూటీ డెరైక్టర్లు కృష్ణవేణి, రమాదేవి, సీఈఓ వెంకటేశ్వర్లు, పీడీ రాము, జేడీఏ రామారావు పాల్గొన్నారు. -
బదిలీలు నిలుపుదల చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వం నిర్వహించే బదిలీ ల్లో సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై దీని ప్రభావం పడుతుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వారు వివరించారు. అలాగే గ్రేడ్-1 వసతి గృహం అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఎస్ ఆనందరావు, కే వెంకట్రావు, గురువి నాయుడు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఈ గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మాద్ హసన్ షరీఫ్, జిల్లా రెవెన్యూ ఆధికారి నూరు భాషా కాశీం తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా... * ఎచ్చెర్ల మండలం కొంగరాం వద్దగల స్మార్టుకాం(వీబీసీ)కర్మాగారం వ్యర్థాలను పొలాల్లోకి విడిచిపెడుతోందని, దీంతో తాగు, సాగునీరు కలుషితం అవుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పరిశ్రమను నిలిపివేయాలని కొంగరాం, ఏజీఎన్పేట గ్రామాలకు చెందిన అనపాల అప్పలస్వామి, డీ సన్యాసిరావు, సీహెచ్ గురువులు, గురివినాయుడు, సీతారాములు, లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు. * వజ్రపు కొత్తురు మండలం నగరం పల్లి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులు రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లు తొలగించారని, రీసర్వే చేయాలని ఆ గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, వీ జయరాం చౌదరి, బమ్మిడి మోహనరావు, సనపల భాస్కరరావు, నందికేశ్వరరావు ఫిర్యాదు చేశారు. * వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరిలో ఫ్యామిలీ కౌన్సిలర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని, అయితే ఇంతరవరకూ పోస్టింగు ఇవ్వలేదని ఎంపికైన అభ్యర్థి విజయలత తదితరులు ఫిర్యాదు చేశారు. * మెలియాపుట్టి మండలం చాపరలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులపై ఆ పాఠశాల హెచ్ఎం దొంగతనం అంటగట్టి విధుల నుంచి తొలగించారని ఫిర్యాదు అందింది. న్యాయం చేయాలని బాధితులు వరలక్ష్మి, దమయంతి, లక్ష్మి, సుందరమ్మ తదితరులు కోరారు. ఇంకా లావేరు మండలం గుర్రాల పాలెం గ్రామస్తులు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని, శ్రీకాకుళం మండలం నైర గ్రామానికి చెందిన అరటి, జీడిమామిడి తోటల రైతులు తుపాను సాయం అందించాలని గ్రీవెన్స్‌లో విజ్ఞఫ్తి చేశారు.