సాక్షి, హైదరాబాద్: వసతిగృహ సంక్షేమాధికారి (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) కొలువుల భర్తీ ప్రక్రియ డీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లతోపాటు ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కూడా పోస్టులు భర్తీ చేస్తున్న ప్రభుత్వం.... విద్యార్హతలను డిగ్రీ–డీఈడీ స్థాయికి పెంచిన అంశాన్ని ప్రకటించకపోవడంపట్ల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు మొదలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ చేపట్టిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో డీఈడీ లేదా బీఈడీలకు అవకాశం కల్పించింది. తాజాగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హతల మార్పు చేపట్టడంతో డీఈడీ చేసిన లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
పది కేటగిరీల్లో 581 పోస్టులు...
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొలువుల జాతరలో భాగంగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటగిరీల వారీగా సంబంధిత నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23న గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2, హాస్టల్ వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2 కేటగిరీల్లో 581 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో అత్యధికంగా గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో 544 పోస్టులున్నాయి. పోస్టులపరంగా ఈ సంఖ్య చాలా పెద్దది కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. తీరా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యాక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న డీఈడీ అభ్యర్థులు తెల్లముఖం వేశారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 కేటగిరీల్లోని 549 పోస్టులకు కేవలం డిగ్రీ బీఈడీ అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి.
అలాగే మరో రెండు కేటగిరీల్లోని 10 గ్రేడ్–1 పోస్టులకు డిగ్రీ–బీఈడీ తప్పనిసరి. కేవలం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 8 కొలువులకే డీఈడీ అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్సీ నిర్ణయంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామంటూ డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అర్హతల్లో మార్పులు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: పుస్తకం.. ఓ బహుమానం
Comments
Please login to add a commentAdd a comment