ఈ ఊరుకు పేరు పెట్టండి.. | Tribal People Living In Unnamed Village in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఈ ఊరుకు పేరు పెట్టండి..

Published Mon, Apr 15 2019 1:27 PM | Last Updated on Mon, Apr 15 2019 1:27 PM

Tribal People Living In Unnamed Village in Vizianagaram - Sakshi

పేరులేని ఊరు ఇదే

విజయనగరం, మెరకముడిదాం: ఆ ఊరుకు పేరులేదు..ఏడేళ్లుగా 22 కుటుంబాల గిరిజనులు అక్కడ నివసిస్తున్నారు. కాని ఆ ఊరికి గుర్తింపు లేదు. అయితే అది ఏజెన్సీ ప్రాంతం అనుకునేరు.. అస్సలు కాదు.. అది మైదాన ప్రాంతమే అయినప్పటికీ కొండపక్కన ఉండడంతో ఏజెన్సీలోని గిరిజన తండాను తలపిస్తోంది. ఇది ఎక్కడో లేదు సాక్షాత్తూ మండల కేంద్రమైన మెరకముడిదాంనకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాలూరు మండలం నుంచి ఏడేళ్ల కిందట వలస వచ్చిన 22 గిరిజన కుటుంబాల వారు అక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ప్రభుత్వ పథకాలేవీ అందలేదు. అంతేకాదు వీరికి అవసరమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయం. అక్కడకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే గాదెలమర్రివలస పంచాయతీ మధుర గ్రామమైన సీతారాంపురం గ్రామం పక్క నుంచి కొండ గోర్జి మీదుగా వెళ్లాల్సిందే. అలాంటి ప్రాంతంలో నివసిస్తున్న వీరికి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదు. పూరిళ్లలో ఉంటున్న వీరు విద్యుత్‌ సౌకర్యం కోసం 2017 నవంబర్‌ 17న చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌కు ఇంటికి రూ. 162 చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంతవరకు ఈ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదు.  

అడ్డుకుంటున్న అటవీ శాఖాధికారులు ..?
డబ్బులు చెల్లించినా విద్యుత్‌ కనెక్షన్లు ఎందుకు వేయలేదని తాము ఆర్‌ఈసీఎస్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారని చెప్పారని ఆ గ్రామానికి చెందిన కొర్రు జోగి, కొర్రు తేల్సు, మర్రి సురేష్, మర్రి శ్రీను, వుంతల సుల్లు, వుంతల సోమయ్య, వుంతల ప్రవీణ్‌కుమార్, సుడపల్లి రాము, కోర్రు బుచ్చమ్మ, వుంతల కోసయ్యమ్మ, మర్రి లక్ష్మి, తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ లేకపోవడంతో రాత్రివేళల్లో కొండపైనుంచి జంతువులు వస్తున్నాయని, వాటితో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో కొండవాగ నీటిని తాగాల్సి వస్తోనంది వాపోతున్నారు. రోగాలు ప్రబలినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారని చెబుతున్నారు. తమను గుర్తించి గ్రామానికి పేరు పెట్టి మౌలిక వసతులు కల్పించాలని 2017, 2019లో కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తమను గుర్తించి మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

విద్యుత్‌ కనెక్షన్లకు డబ్బులు చెల్లించామంటూ రశీదులు చూపిస్తున్న గిరిజనులు
అన్నీ ఇబ్బందులే..

గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలూ లేవు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రామానికి పేరే లేకపోవడం మరింత శోచనీయం. ఎవరి దగ్గరకు వెళ్లినా మీది ఏ ఊరని అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలి.–   కొర్ర బుచ్చమ్మ

భయంగా ఉంటోంది..
ఏడేళ్లుగా ఇక్కడే భార్యాపిల్లలతో జీవిస్తున్నాం. విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో కొండమీద నుంచి జంతువులు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు స్పందించి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి.–  కొర్ర జోగి, గ్రామస్తుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement