![Tribal Peoples are suffering from Road facilities in Srikakulam - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/5/skl.jpg.webp?itok=0Uq0y-Ig)
ఎల్.ఎన్.పేట: మారుమూల గ్రామాలకు సైతం పక్కా రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న పాలకుల మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. గిరజన ప్రాంతాల్లో చాలా గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో వారి బాధలు అన్నీఇన్నీ కావు. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న సంఘటననే ఇందుకు ఉదాహరణంగా చెప్పవచ్చు.
మండల కేంద్రమైన ఎల్.ఎన్.పేటకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కౌండచొర్లంగి అదనే గిరిజన గ్రామం ఉంది. సుమారు 60 కుంటుంబాలు ఎక్కడ నివసిస్తున్నాయి. గ్రామానికి చెందిన గర్భణి సవర నయోమినికి బుధవారం తెల్లవారుజామున పురిగినొప్పులు వచ్చాయి. అయితే గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో 108 వాహనం రాలేదు. దీంతో స్థానికులంతా డోలీ కట్టి ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న గోలుకుప్ప గ్రామ సమీపంలో ప్రధాన రహదారికి మోసుకొని తీసుకొచ్చారు.
అక్కడ నుంచి 108 వాహనంలో శ్రీకాకులంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని అధికారులను వేడుకుంటున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ద్విచక్ర వాహనం కూడా గ్రామానికి వచ్చే అవకాశం లేదని సవర ఫల్గుణరావు, సవర బాపన్న చెప్పారు. పాలకులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment