గుమ్మలక్ష్మిపురం: మండలంలోని దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇమరిక ఆనంద్(14) అనే విద్యార్థి అనారోగ్యానికి గురై దుడ్డుకల్లు పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆనంద్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పాఠశాల సిబ్బందిని గట్టిగా నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం పెదమరిక పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన ఆనంద్ ఆరవ తరగతి నుంచి ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆనంద్‌కు జ్వరం రావటంతో వార్డెన్ తాకేటి బాలయ్య స్థానిక పీహెచ్‌సీలో వైద్యం చేయించారు. శనివారం ఉదయం ఆనంద్‌కు ఫిట్స్ రావడంతో దుడ్డుకల్లు పీహెచ్‌సికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారి రమేష్ లేరు.
స్టాఫ్‌నర్స్ వైద్యాధికారికి ఫోన్ చేసి ఆయన సలహా మేరకు బీపీ చూసి సెలైన్ ఎక్కించారు. కానీ ప్రయోజనం దక్కలేదు. ఆనంద్ మృతిచెందిన సంగతి తెలుసుకున్న తల్లి కమల, తమ్ముడు మన్మధరావు, ఇతర కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు దుడ్డుకల్లు పీహెచ్‌సికి చేరుకుని బోరున విలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్‌లను గట్టిగా నిలదీశారు. సమయానికి వైద్యాధికారి రమేష్ ఆస్పత్రిలో లేకపోవటం వల్లే ఘోరం జరిగిందని వాపోయారు. ఐటీడీఏ పీవో, ఆర్డీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఇతర ఉన్నతాధికారులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని భీష్మించారు. విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాల మేరకు పార్వతీపురం ఆర్డీవో ఆర్ గోవిందరావు పీహెచ్‌సీకీ చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు.
అందించిన చికిత్స గురించి వైద్యసిబ్బందిని, ఆనంద్ ఆరోగ్యం గూర్చి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆనంద్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ డీడీ ప్రభాకరరావు, డిప్యూటీ ఈవో రమణనాయుడు తదితరులు పీహెచ్‌సీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆనంద్ తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారని కొత్తూరు గ్రామస్తులు చెప్పారు. ఇంతలోనే ఘోరం జరగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
Published Sun, Jul 12 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement